డోనాల్ట్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ బీద బిక్కి అనే తేడా లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకూ ఈ మహమ్మారి బారినపడ్డ అమెరికా అతున్నతస్థాయి అధికారి కూడా ఇతనే.
జులై నెల ప్రారంభంలో ఓబ్రియాన్ తన కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరయ్యేందుకు మూడు రోజుల పాటు పారిస్ పర్యటనకు వెళ్లివచ్చారు. అక్కడ. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీకి చెందిన వారితో కలిసి తిరిగాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక వైరస్ లక్షణాలు కనిపించే సరికి పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఓబ్రియాన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారని, ఆయనకు తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఆయన సురక్షితమైన ప్రదేశం నుంచి తన పని చేస్తున్నారని వెల్లడించింది. అలాగే, జాతీయ భద్రతా మండలి పని నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొంది.
దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి వైరస్ సోకే అవకాశం లేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ తో సన్నిహితంగా తిరిగే పలువురు అధికారులు, కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ వచ్చింది. ఇటీవల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఎక్కువ సార్లు కరోనా పరీక్ష చేయించుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి.