వార్నింగ్ : కరుగుతున్న మంచు..బైటపడుతున్న శవాలు

ఢిల్లీ: వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భూమిపై అంతకంతకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బారిన పడుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎవరెస్ట్‌పై మంచు చాలా వేగంగా కరిగిపోతోంది.
ఈ మంచు కరిగే కొద్దే..శిఖరంపై ఉన్న శవాలు (గతంలో పలు మరణించినవారు) ఒక్కొక్కొటిగా బయటపడుతున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఎవరెస్ట్‌ను అధిరోహించటానికి వెళ్లినవారు మధ్యలోనే ప్రాణం విడిచిన సాహస యాత్రికులవే. ఇలా 1922 నుంచి ఇప్పటివరకు ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించి మరణించిన వారు 200గా నమోదయ్యింది. వీళ్లందరి శవాలు ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఇప్పుడు మంచు కరుగుతుండటంతో ఆ శవాలు ఇప్పుడు బయటపడుతున్నాయట. ఇలా ఆచూకీ లభించిన శవాల్లో కొన్ని 1970ల్లో వచ్చిన బ్రిటిష్ యాత్రికులవిగా గుర్తించారు అధికారులు.
రోజు రోజుకూ పెరుగుతున్నవాతావరణ మార్పులతో మంచు, గ్లేసియర్స్ వేగంగా కరిగిపోతోంది. దీంతో క్లైంబర్ శవాలు బైటపడుతున్నాయి అని ఆంగ్ షెరింగ్ షేర్పా చెప్పారు. 2008 నుంచి ఏడుగురి శవాలను పర్వతం నుంచి కిందికి తీసుకొచ్చామని తెలిపారు. అయితే ఎవరెస్ట్‌పై ఉన్న మంచు వేగంగా కరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు నేపాల్ నేషనల్ మౌంటేన్ గైడ్స్ అసోసియేషన్ అధికారి సోబిత్ కున్వర్. ఈ క్రమంలో ప్రతీ సంవత్సరం మీటరు మేర గ్లేసియర్లు కరుగుతున్నాయని తెలిపారు. దీంతో బయటపడుతున్న శవాలు కొన్నింటిని కిందికి తీసుకొస్తుండగా.. తీసుకురాలేని పరిస్థితుల్లో మరికొన్నింటిని అక్కడే వదిలేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎవరెస్ట్‌పై నుంచి శవాలను కిందికి తీసుకురావడం ప్రమాదమే కాదు.. చాలా ఖర్చుతో కూడుకున్న పని అని కూడా సోబిత్ కున్వర్ తెలిపారు.