బ్రిటన్ లో పరిస్థితి చేయి దాటిపోయింది…ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ లో పరిస్థితి చేయి దాటిపోయింది…ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

Updated On : December 20, 2020 / 8:32 PM IST

Covid-19 is ‘out of control’ in UK బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ ఆదివారం(డిసెంబర్-20,2020) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ నియంత్రణలో లేదని మాట్ హాన్కాక్ అంగీకరించారు. అయితే,కరోనా విజృంభణ నేపథ్యంలో లండ‌న్ ‌తోపాటు ఆగ్నేయ‌ ఇంగ్లండ్‌ లో టైర్-4 లాక్ డౌన్ విధిస్తున్నట్లు బ్రిటన్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల త‌ర్వాతే..దేశంలో పరిస్థితి చేయిజారిపోందంటూ మాట్ హాన్కాక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం బీబీసీకి చెందిన ఆండ్రూ మార్ షోలో భాగంగా.. బ్రిట‌న్‌ లో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉందా అన్న ప్ర‌శ్న‌కు..లేదు అని హాన్కాక్ స‌మాధాన‌మిచ్చారు. ప్ర‌స్తుతం చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ క్రిస్మ‌స్ ‌కు ప్ర‌జ‌లు ఇచ్చే ఉత్త‌మ‌మైన బహుమ‌తి వైర‌స్‌ను వ్యాప్తి చేయ‌కుండా ఇంట్లో ఉండ‌ట‌మేనని తెలిపారు. దేశ ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ అందే వ‌ర‌కూ అంటే కొన్ని నెల‌ల పాటు లండ‌న్‌లో లాక్‌డౌన్ కొన‌సాగ‌వ‌చ్చని హాంకాక్ తెలిపారు. సులభమైన సమాధానాలు లేదా సులభమైన ఆప్షన్స్ లేవని అన్నారు. కొత్త శాస్త్రీయ ఆధారాలను విస్మరించడం పొరపాటని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, బ్రిటన్ ప్రధాని శనివారం ప్రకటించిన కఠినమైన టైర్-4 లాక్ డౌన్ ఆదివారం అర్ధరాత్రి నుంచి లండన్, ఆగ్నేయ‌ ఇంగ్లండ్‌ లో అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసరం కాని వ్యాపారాలన్నీ మూసేయాల్సి ఉంటుంది. క్రిస్మస్‌ పై ఈ లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపనుంది. క్రిస్మ‌స్ సంబ‌రాల‌ను కూడా ర‌ద్దు చేసుకోవాల‌న్న బ్రిట‌న్ ప్ర‌ధాని సూచ‌ించడంతో పెద్ద సంఖ్యలో లండన్ వాసులు ఇతర నగరాలకు తరలివెళ్తున్నారు. ఈసారి క్రిస్మస్‌ను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

కొత్తరకం కరోనా వైరస్ “నియంత్రణలో లేదు”అని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించడంతో…యూరోపియన్ దేశాలు ఆదివారం నుంచి UK నుండి వచ్చే విమానాలను నిషేధించడం ప్రారంభించాయి. ఆదివారం నుంచి అన్ని UK ప్రయాణీకుల విమానాలపై నిషేధం అమల్లోకి వస్తుందని నెదర్లాండ్స్ ఇప్పటికే ప్రకటించింది. వేల్స్ మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ నుంచి రాకపోకలపై స్కాట్ లాండ్ కూడా బ్యాన్ విధించింది. బెల్జియం కూడా ఈ అర్ధరాత్రి నుండి బ్రిటన్ నుండి విమాన మరియు రైలు రాకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జర్మనీ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

కాగా, దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ఈ వైరస్‌ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందన్నారు. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్తరకం వైరస్‌ను వాక్సిన్‌ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు.

ఇక, బ్రిటన్ ​లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. ఫైజర్‌ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి లభించగా.. 90 ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ లో 3లక్షల 50 వేల మందికి తొలి డోసు టీకా అందించారు.

మరోవైపు, ఇటలీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటం వల్ల మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించారు. క్రిస్మస్‌ నేపథ్యంలో ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్‌ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో అత్యవసర పనుల నిమిత్తం తప్ప బయట తిరిగేందుకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. క్రిస్మస్‌ నేపథ్యంలో యూరప్‌ దేశాలైన జర్మనీ, నెదర్లాండ్‌లు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.