లంకలో మళ్లీ కలకలం : 3 చోట్ల బాంబు పేలుళ్లు

ఈస్టర్ పండుగ నాటి మారణహోమాన్ని మరువకముందే శ్రీలంక మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కల్మునాయ్ నగరంలోని సైందమరుదు ప్రాంతంలో మూడు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈస్టర్ సండే పేలుళ్ల అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. తనిఖీల సందర్భంగా కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు పోలీస్ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర వెల్లడించారు.
తూర్పు ప్రాంతంలోని పలు నగరాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో పేలుడు సామగ్రి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ యూనిఫాంలు, జెండాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సమ్మంతురాయ్‌లో 150 జిలెటిన్ స్టిక్స్, లక్ష బాల్ బేరింగ్స్, ఓ డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘర్షణ సందర్భంగా ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేసుకున్నాడని తెలిపారు. కల్మునాయ్, సమ్మంతురాయ్, చవలకడాయ్‌లో కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్క ఇంటినీ తనిఖీ చేయాల్సిందేనంటూ దేశ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన పోలీసులను ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఈ పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని వెల్లవాట్ రైల్వే స్టేషన్ సమీపంలో ముగ్గురు అనుమానితులను నేవీ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈస్టర్ సండే (ఏప్రిల్ 21,2019) శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో చిగురుటాకులా వణికిపోయింది. క్రైస్తవులకు పర్వం దినం అయిన ఈస్టర్ సండే నాడు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. చర్చిలకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని రక్తపుటేరులు పారించారు. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా దాడులు జరిగాయి. వందలాది మంది చనిపోయారు. 400 మంది గాయపడ్డారు. ఇది మరువకముందే మరోసారి బాంబు పేలుళ్లు జరగడం లంక ప్రజల్లో ఆందోళన నింపింది.