Barry Wilmore: నాసా వ్యోమగామి విల్మోర్ ఆరోగ్యంపై అతని భార్య డీనా కీలక విషయాన్ని వెల్లడించారు

సుదీర్ఘకాలం తరువాత భూమిపైకి తిరిగివచ్చిన నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ భార్య డీనా విల్మోర్ ప్రస్తుతం అతని ఆరోగ్యంపై కీలక విషయాలు వెల్లడించింది.

Barry Wilmore: నాసా వ్యోమగామి విల్మోర్ ఆరోగ్యంపై అతని భార్య డీనా కీలక విషయాన్ని వెల్లడించారు

NASA astronaut Barry Wilmore wife Deanna Wilmore

Updated On : March 27, 2025 / 2:05 PM IST

NASA astronaut Barry Wilmore wife: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు తొమ్మిది నెలలు తరువాత భూమిపైకి చేరుకున్న విషయం తెలిసిందే. వ్యోమగాములు ఎక్కువకాలం అంతరిక్ష కేంద్రంలో ఉండటం వల్ల శరీర బరువును కోల్పోవటం, కండరాలు క్షీణించిపోవటం, సంతులనాన్ని కోల్పోవటం, ఎముకల సాంద్రత తగ్గిపోవటం వంటివాటికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో వ్యోమగాములు భూ వాతావరణానికి అలవాటు పడటానికి నాసా పునరావాస కేంద్రానికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

 

సుదీర్ఘకాలం తరువాత భూమిపైకి తిరిగివచ్చిన నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ ఆరోగ్య పరిస్థితిపై అతని భార్య డీనా విల్మోర్ కీలక విషయాలు వెల్లడించారు. విల్మోర్ భూమిపైకి వచ్చిన తరువాత అతన్ని నాసా పునరావాస కేంద్రంలో భార్య డీనా విల్మోర్, ఇద్దరు కుమార్తెలు డారిన్, లోగన్ లు కలిశారు. తాజాగా.. డీనా విల్మోర్ ‘డైలీ మెయిల్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్ విల్మోర్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

 

సుదీర్ఘకాలం అంతరిక్ష కేంద్రంలో ఉండటం వల్ల.. గురుత్వాకర్షణ శక్తి ప్రస్తుతం తన స్నేహితుడు కాదని విల్మోర్ చెబుతున్నాడు.. అతనికి స్టామినా లేదు. వారు ఇంకా బలంగా లేనందున విశ్రాంతి తీసుకోవాలని డీనా విల్మోర్ పేర్కొంది. విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చిన తరువాత అతన్ని కలిసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. ‘ఎక్కువగా మాట్లాడుకోలేదు. చాలాసేపు కౌగిలించుకొని ఆ క్షణాన్ని ఆశ్వాదించాను’ అని చెప్పింది. లోగన్ వచ్చే నెలలో తన ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేషన్ కు సిద్ధమవుతుంది. ఆ సమయంలోపు విల్మోర్ ఇంటికి వస్తాడని భావించాం. కానీ, తన తండ్రి ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం దాదాపు లేదని డీనా విల్మోర్ పేర్కొంది.