కరోనా వైరస్ దెబ్బకు సామాన్యులే కాదు.. సంపన్నలతో పాటు వైద్యులు కూడా వణికిపోతున్నారు. కరోనా బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వైద్య సౌకర్యాలు అంతంతమాత్రమే.. కరోనాకు మందు లేదు.. అయినా బాధితులను రక్షించేందుకు అవసరమైన నివారణ చికిత్సలను అందించాల్సి ఉంది. ఎప్పుడు ఎవరి నుంచి వైరస్ సోకుతుందోనన్న భయమే వారిలో కనిపిస్తోంది. అందుకే ఇంటి నుంచి ఆస్పత్రులకు వెళ్లి తిరిగొచ్చేవరకు చెప్పలేని పరిస్థితి. ఎక్కడా వైరస్ బారినపడతామోనన్న ఆందోళనే ఎక్కువగా వారిలో కనిపిస్తోంది.
అందుకే ముందుస్తుగా చాలామంది వీలునామాలు రాసేస్తున్నారంతా.. ఇప్పటికే కొందరు సంపన్నులు ముందు జాగ్రత్తగా ఆస్తుల పంపకాలకు సిద్ధపడుతున్నారు. వీలునామాలతో తమ తర్వాతి తరానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. కరోనా వ్యాప్తి గురించి ఎక్కువగా వినడం వల్ల వారిలో తెలియకుండానే ఒక రకమైన భయం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. తమ భార్యాపిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే వీలునామాలతో మొదలుపెట్టారని అంటున్నారు.
ఇకపోతే.. బ్రిటన్ ఆస్పత్రులకు రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యుల్లోనూ ఇదే కలవరం మొదలైంది. కరోనా సోకినవారికి వైద్యం చేసే వైద్యులకు సైతం కరోనా సోకుతోంది. సామాన్యులతో పాటు వైద్యులు కూడా కరోనాతో పోరాడుతున్న పరిస్థితి ఉంది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేయడం కూడా వైద్యులకు ప్రాణాంతకంగానే కనిపిస్తోంది. వైరస్ సోకి పలువురు వైద్యులు మృతిచెందిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యుల అవసరమైన రక్షణ సదుపాయాలు పెంచాలని ఓ సీనియర్ డాక్టర్ బ్రిటన్ ప్రధానికి లేఖ రాశారు.
అయితే ఆ లేఖ రాసిన వైద్యుడు కొన్ని రోజుల క్రితమే వైరస్ బారినపడి మృతిచెందినట్టు ఓ నివేదిక తెలిపింది. వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందించే వైద్యుల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. అందుకే వైద్యులంతా ఆస్పత్రుల్లో విధులకు వెళ్లే ముందే వీలునామాలు రాసేస్తున్నారు. ఇవాళ విధులు నిర్వహించిన వైద్యులు రేపు కూడా విధులు నిర్వర్తించగలమా? లేదా అనే సందేహంతో ముందస్తుగా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. కరోనా సోకినవారిలో రోగ నిరోధక శక్తి ఉన్నవారు కాస్తా వైరస్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. కానీ, వ్యాధి నిరోధకత లేనివారంతా మృతిచెందుతున్నారు.