భారత్ కు ట్రంప్ షాక్…ప్రాధాన్యత వాణిజ్య హోదా తొలగింపు

భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు లేకుండా అమెరికాలో ప్రవేశించేందుకు వీలుగా భారత్ కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదా(ఫ్రిఫరెన్షియల్ ట్రెడ్ ట్రీట్మెంట్)ను తొలగించాలని  ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు ట్రంప్ లేఖ ద్వారా తెలియజేశారు. ట్రంప్ నిర్ణయంతో భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(GSP) కింద అమెరికా మార్కెట్లలో భారత్ కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నామని, భారత మార్కెట్లలోనూ అమెరికాకు ఇలాంటి సదుపాయాలు కల్పించాలని కోరినప్పటికీ భారత్ నుంచి ఎలాంటి సృష్టమైన హామీ అభించకపోవడంతో భారత్ కు ప్రాధాన్యత వాణిజ్య హోదాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్ తెలిపారు. భారత్ తో పాటు టర్కీకి కూడా ఈ హోదాను ఉపసంహరించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. గడిచిన నాలున్నర దశాబ్దాల్లో టర్కీ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని, ఇక ఆ దేశానికి ప్రాధాన్యత హోదా అవసరం లేదని మరో లేఖలో ట్రంప్ తెలిపారు. 

జీఎస్ పీ ప్రోగ్రామ్ కింద కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా ప్రధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తోంది. ఇందులో భారత్ కూడా ఉంది. దీని ద్వారా ఎలాంటి ట్యాక్స్ లు లేకుండా అమెరికా మార్కెట్లలోకి కొన్ని వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత్ కు వీలు ఉంటుంది. ఇప్పుడు ఆ హోదాను తొలగిస్తే..భారత్ నుంచి ఎగుమతి చేసే అన్ని వస్తువులపై అమెరికా ట్యాక్స్ లు విధిస్తుంది. దీంతో భారత్ కు భారీగా నష్టం చేకూరే అవకాశముంది