Iran Israel War: దుబాయ్ బంపర్ ఆఫర్.. వార్ ముగిసే వరకు టూరిస్టులు బిల్లు కట్టక్కర్లేదు..
దుబాయ్ ఆర్థిక పర్యాటక శాఖ ఒక అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది. గెస్టులు వారి బసలను పొడిగించుకోవడానికి అనుమతించాలంది.
Representative Image (Image Credit To Original Source)
- యుద్ధం కారణంగా హోటల్స్ లో చిక్కుకుపోయిన టూరిస్టులు
- వారి బస పొడిగించాలని హోటళ్లకు దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు
- టూరిస్టుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయొద్దని ఆదేశాలు
Iran Israel War: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ప్రభావితమవుతున్నారు. ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబిలో అనేక మంది ఇరుక్కుపోయారు. విమాన రాకపోకలు నిలిపివేయడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో టూరిస్టులకు దుబాయ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వార్ ముగిసే వరకు టూరిస్టులు బిల్లు కట్టక్కర్లేదని చెప్పింది. ఈ మేరకు హోటళ్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
దుబాయ్, అబుదాబి హోటళ్లకు కీలక ఆదేశాలు..
అసాధారణ పరిస్థితుల కారణంగా గడువు ముగిసినా బయలుదేరలేని అతిథుల కోసం బసలను పొడిగించాలని దుబాయ్, అబుదాబి హోటళ్ల యాజమాన్యాలను అధికారులు ఆదేశించారు. ప్రయాణ అంతరాయాల వల్ల ప్రభావితమైన అంతర్జాతీయ సందర్శకులను రక్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు. టూరిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని హోటళ్ళను ఆదేశించారు. వసతి కొనసాగింపు ఉండేలా చూసుకోవాలని, దేశం విడిచి వెళ్ళలేకపోతే ప్రయాణికులను గదిని ఖాళీ చేయమని అడగకూడదని, పొడిగింపు ఖర్చులను కూడా భరించాలి ఆదేశించింది. గెస్టులు తిరిగి వెళ్లేంత వరకు వారి బసను పెంచాలంది.
దుబాయ్ ఆర్థిక పర్యాటక శాఖ ఒక అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది. గెస్టులు వారి బసలను పొడిగించుకోవడానికి అనుమతించాలంది. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ ప్రయాణికులకు పూర్తి మద్దతు అందించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా ఈ చర్య ఉందని కూడా ఆ విభాగం పేర్కొంది. అంతేకాకుండా, అతిథులు పొడిగింపు ఖర్చును వెంటనే చెల్లించలేకపోతే గదిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.
ఆ ఖర్చును భరించనున్న అబుదాబి ప్రభుత్వం..!
చిక్కుకుపోయిన అతిథుల వసతి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అబుదాబి తెలిపింది. అబుదాబి సంస్కృతి పర్యాటక శాఖ హోటళ్లకు పంపిన సర్క్యులర్లో గెస్టులు బయలుదేరే వరకు వారి బసను పొడిగించాలంది. పొడిగించిన బస ఖర్చును DCT అబుదాబి భరిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పర్యాటక రంగంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగం. ఈ చర్య ప్రస్తుతం దుబాయ్, అబుదాబిలో చిక్కుకున్న ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లైంది.
Also Read: యుద్ధంలోకి మరికొన్ని దేశాలు.. చినికి చినికి వరల్డ్ వార్ అవుతుందా?
