Video : ఊహించని గిఫ్ట్.. బోరుమని ఏడ్చేసిన బామ్మ! 

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 07:44 AM IST
Video : ఊహించని గిఫ్ట్.. బోరుమని ఏడ్చేసిన బామ్మ! 

Updated On : December 28, 2019 / 7:44 AM IST

ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. వివాహ బంధంతో ఒక్కటై వందేళ్ల జీవితంలో తన వెంట నడిచిన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే ఎంత కుమిలిపోతారో మాటల్లో చెప్పలేం. అలాంటి బంధాలు అనుబంధాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. ఒకప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు దు:ఖం ఒక్కసారిగా పొంగుకుస్తుంటుంది.

భర్త చనిపోయినప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోందో బామ్మ. భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటే ఆ జ్ఞాపకాల్లోనే బతికేస్తోంది. అలా జీవనం సాగిస్తున్న ఆ బామ్మకు క్రిస్మస్ రోజున ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు కుటుంబ సభ్యులు. మనవళ్లు, మనమరాళ్లంతా కలిసి బామ్మకు వెలకట్టలేని బహుమతిని ఇచ్చారు. ఆ గిఫ్ట్ అందుకున్న బామ్మ మనస్సు ఒక్కసారిగా చలించిపోయింది. హృదయం ద్రవించిపోయింది.

గిఫ్ట్‌ను తెరవగానే.. అందులో ఒకప్పడూ తన భర్త తాను రాసుకున్న లెటర్లను చూసి భావోద్వేగానికి గురైంది. ఆ లెటర్లను అలాగే చూస్తుండిపోయింది. ఆనాటి క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడంతో కన్నీళ్లు ఆపులేక బోరుమని ఏడ్చేసింది. హృదయానికి హత్తుకునేలా ఉన్న ఈ బామ్మ వీడియోను డిసెంబర్ 26న సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఏడు నెలల క్రితమే బామ్మ తన భర్తను కోల్పోయింది.

ఆ తర్వాత భర్త లేకుండా తొలిసారి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి 1962లో బామ్మకు తాత ఇద్దరూ రాసుకున్న లెటర్లను సేకరించి ఇలా బామ్మకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా చలించిపోయారు. బామ్మకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు 1.2 మిలియన్ల లైక్స్ రాగా, 2లక్షలకు పైగా రీట్వీట్ చేశారు.