టెస్ట్ రన్ కూడా చేసేసింది : ఎలక్ట్రిక్ విమానాలు తయారుచేస్తున్న చైనా

ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లవైపు చూస్తుంటే చైనా మాత్రం అంతకుమంచి అంటోంది. చైనీయులు ఎలక్ట్రిక్ కార్ల నుండి ఎలక్ట్రిక్ విమానాలకు వెళుతున్నారు. చైనా తయారుచేసిన నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ విమానం టెస్ట్ విజయంవంతం అయినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. స్వల్ప-దూర రవాణా కోసం బ్యాటరీతో నడిచే విమానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చైనా పనిచేస్తోంది. చైనా తయారు చేసి పరీక్షించిన ఎలక్ట్రిక్ విమానం RX 4E విమానం 1,200 కిలోల బరువుతో ఉంటది. ఒకసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంది. విమాన పరీక్ష సమయంలో ఈశాన్య నగరం షెన్యాంగ్ మీదుగా ఎగిరినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఈ విమానం 70 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ప్లేన్… సుమారు 77 శాతం తేలికైన, తుప్పు-నిరోధక కార్బన్ పదార్థాలతో తయారు చేయబడింది. ఎలక్ట్రిక్ విమానం తక్కువదూరం ప్రయాణాలకు, పైలట్ శిక్షణకు లేదా పర్యాటక విమానాలకు ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ విమానాలు వాణిజ్యపరంగా లాభదాయకంగా మారితే ఆకర్షణీయమైన రవాణా మార్గంగా మారవచ్చు.
ఉబెర్ టెక్నాలజీస్ కూడా ఎలక్ట్రిక్ ఫ్లయింగ్-టాక్సీ సేవలను త్వరలో ప్రారంభించాలని యోచిస్తోంది. వీటిలో మొదటిది 2023లో మెల్బోర్న్ లో ప్రారంభమవుతుంది. వారి ఎలక్ట్రిక్ టాక్సీలు డల్లాస్, లాస్ ఏంజిల్స్ లలో కూడా పైలట్ చేయబడతాయి.