Saleh
Afghanistan ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ మంగళవారం(ఆగస్టు-17,2021) ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అప్ఘానిస్తాన్ లోని పంజ్ షిర్ లో(తాలిబన్లు ఆక్రమించుకోలేకపోయిన ఏకైక ఫ్రావిన్స్)ఉంటూ తాలిబన్లకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు అమ్రుల్లా సలేహ్.
తాలిబన్ కు వ్యతిరేకంగా ఏర్పాటై..2001 డిసెంబర్ లో అప్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలనను అంతమొందిచడంలో కీలక పాత్ర పోషించిన నార్తర్న్ అలయన్స్ నేతలతో అమృల్లా సల్లేహ్ కీలక చర్చలు జరుపుతున్నారు. పంజ్ షిర్ ప్రధాన కేంద్రంగా..తాలిబాన్లపై పోరాటానికి అప్ఘానిస్తాన్ నాయకులందరినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు అమృల్లా సల్లేహ్. అమృల్లా సలేహ్ నేతృత్వంలో తాలిబన్లను ఎదుర్కొనేందుకు నార్తర్న్ అలయన్స్‌తో కలిసి పనిచేస్తామని అఫ్గాన్ సేనలు, ప్రజలు ముందుకొస్తున్నారు.
అయితే తాలిబన్ కి వ్యతిరేకంగా నిలబడి మరియు యుద్ధం ఇంకా ముగియలేదని ప్రకటించిన అమృల్లా సలేహ్ ఎవరు,రాక్షసత్వానికే మారుపేరైన తాలిబన్లనే ఎదిరిస్తున్న అమృల్లా వెనుక ఎవరు ఉన్నారనేది చూద్దాం.
అమృల్లా సలేహ్ ఎవరు?
1972 అక్టోబర్ లో పంజ్ షిర్ రాష్ట్రంలోని తజిక్ జాతి కుటుంబంలో జన్మించిన అమ్రుల్లా సలేహ్ చిన్న వయస్సులోనే అనాథగా మారారు. తాలిబన్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు పంజ్ షిర్ సింహంగా పిలువబడే అహ్మద్ షా మసూద్(నార్తర్న్ అలయన్స్ వ్యవస్థాపకుడు)ప్రారంభించిన ఉద్యమంలో చిన్నవయస్సులోనే చేరారు అమ్రుల్లా సలేహ్. అమ్రుల్లా సలేహ్ వ్యక్తిగతంగా తాలిబాన్ల చేతిలో నష్టపోయారు. 1996 లో తాలిబాన్ ఫైటర్లు సలేహ్ సోదరిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. 1996 లో జరిగిన సంఘటనల కారణంగా తాలిబాన్ల పట్ల నా అభిప్రాయం శాశ్వతంగా మారిపోయింది అని గతంలో టైమ్ మ్యాగజైన్ ఎడిటోరియల్‌లో సలేహ్ పేర్కొన్నారు.
తన నాయకుడితో(అహ్మద్ షా మసూద్) మరియు ఉత్తర కూటమిలో భాగమై.. తాలిబాన్లను ఓడించడానికి సలేహ్ పోరాడాడు. 1997 లో, తజికిస్థాన్‌లోని దుషాన్‌బే సిటీలోని అఫ్ఘానిస్తాన్ రాయబార కార్యాలయంలో యునైటెడ్ ఫ్రంట్ యొక్క అంతర్జాతీయ అనుసంధాన కార్యాలయానికి నాయకత్వం వహించడానికి సలేహ్ నియమించబడ్డాడు. అక్కడ ఎన్జీవో సంస్థలకు(మానవతా) సమన్వయకర్తగా మరియు విదేశీ గూఢచార సంస్థలకు అనుసంధాన భాగస్వామిగా సలేహ్ పనిచేశాడు.
అమృల్లా సలేహ్-ఓ గూఢచారి
అమెరికాలో 9/11 దాడి మరియు అఫ్ఘాన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించే వరకు ఉత్తర కూటమి(నార్తర్న్ అలయన్స్) ప్రతిఘటనలో భాగంగా అమృల్లా కొనసాగారు. అమెరికా అప్ఘానిస్తాన్ లో యుద్ధం జరిపిన సమయంలో అమెరికా గూఢచర్య సంస్థ(CIA)యొక్క ముఖ్య ఆస్తిగా మారిన అమృల్లా సలేహ్..గత తాలిబాన్ పాలనను అంతమొందించడానికి క్షేత్రస్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ యొక్క నిఘా కార్యకలాపాలకు(Intelligence Operations) నాయకత్వం వహించాడు. ఈ రిలేషన్ షిప్… తాలిబాన్లను తరిమికొట్టిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలలో అనేక ముఖ్యమైన పాత్రలను పోషించడానికి అమల్లా సలేహ్ కి మార్గం సుగమం చేసింది.
తాలిబన్ల పాలన అంతం తర్వాత 2004 డిసెంబర్ లో కొత్తగా ఏర్పడిన అఫ్ఘనిస్తాన్ గూఢచార సంస్థ- నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ (NDS)కి హెడ్ గా నియమితులయ్యారు అమృల్లా సలేహ్. 2010 జూన్ వరకు NDS హెడ్ గా పనిచేసిన సలేహ్..అఫ్ఘానిస్తాన్ లోపల మరియు పాకిస్తాన్ సరిహద్దులో తాలిబాన్లకు మద్దతు ఇస్తున్న అన్ని తీవ్రవాద నెట్‌వర్క్‌ల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించడానికి చాలా బలమైన గూఢచారి నెట్‌వర్క్‌ను నిర్మించాడు.
సలేహ్.. నిర్మాణ సంస్కరణలను ప్రారంభించి అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పునర్నిర్మించడంలో సహాయపడ్డాడు. సలేహ్ మనుషులు కొంతమంది తాలిబాన్లలోకి చొరబడి..ఆ సంస్థ కార్యకలాపాల యొక్క వివరాలు(నాయకులు, కమాండర్లు, వారి కుటుంబాలు, గృహాలు, పరిచయాలు, ఆదాయ వనరు)ను ఎప్పటికప్పుడు తెలుసుకుని సలేహ్ కి చేరవేస్తుండేవారు. తాలిబన్ ని కట్టడి చేయడానికి అప్ఘానిస్తాన్ ప్రభుత్వానికి ఈ సమాచారం చాలా ఉపయోగపడేది. అయితే పాకిస్తాన్ నుంచి తాలిబన్ ని మద్దుతు లభిస్తుండటంతో అప్పుడూ క్లిష్ఠ పరిస్థితులు తలెత్తుతూనే ఉండేవి.
పాకిస్తాన్ మిలటరీ నుండి తాలిబన్ కి మద్దతు లభిస్తున్న విషయాన్ని కనుగొన్న సలేహ్ కి..పాకిస్తాన్ పై విపరీతమైన ద్వేషం,అయిష్టత కలిగి ఉండేవాడు సలేహ్. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ తో జరిగిన ఓ సమావేశంలో సలేహ్ వ్యాఖ్యానించగా..దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముషారఫ్ ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
గూఢచారి నుంచి రాజకీయ నాయకుడిగా
జూన్ 6 2010 న ఓ తీవ్రవాద దాడికి బాధ్యత వహిస్తూ NDS హెడ్ పదవికి రాజీనామా చేశాడు సలేహ్. అయితే ఆ తర్వాత తాలిబన్లు అప్పటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో చర్చలకు ముందుకొచ్చారు. అయితే ఇది ఒక ట్రాప్ అని,తాలిబన్లతో చర్చలు వద్దంటూ ప్రభుత్వాన్ని సలేహ్ హెచ్చరించారు. అయితే, చర్చలు జరిగాయి. అదే అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ పై విశ్వాస ఉల్లంఘనకు నాంది పలికింది.
2011 లో సలేహ్ హమీద్ కర్జాయ్ కి వ్యతిరేకంగా శాంతియుత ప్రచారాన్ని సలేహ్ ప్రారంభించాడు. అధ్యక్షుడు కర్జాయ్ పాలసీలపై తీవ్ర విమర్శలు గుప్పించాడు సలేహ్. ముఖ్యంగా భద్రతా పరిస్థితులను ఎదుర్కోవడంలో కర్జాయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు సలేహ్. అంతేకాకుండా కర్జాయ్ అవినీతిని బహిరంగంగా ఎండగట్టేవాడు.
ఈ క్రమంలో అప్ఘానిస్తాన్ గ్రీన్ ట్రెండ్ గా కూడా పిలువబడే బసేజ్-ఈ- మిల్లి పేరుతో రాజకీయ పార్టీని సలేహ్ ప్రారంభించాడు. 2011లో రాజధాని కాబూల్ లో 1లక్ష మందికి పైగా సలేహ్ అనుచరులు తాలిబన్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అష్రఫ్ ఘనీతో సలేహ్ చేతులు కలిపారు. 2014లో అష్రఫ్ ఘనీ దేశ అధ్యక్షుడయ్యారు. అదే ఏడాది డిసెంబర్ లో సలేహ్ ని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించారు ఘనీ. 2019 అప్ఘాన్ ఎన్నికల్లో మరోసారి గెలిచిన అష్రఫ్ ఘనీ అధ్యక్షుడైన తర్వాత..సలేహ్ ని దేశపు మొదటి వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు.
నాయకుడి నుంచి ఫైటర్ గా
ప్రస్తుతం అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న తాలిబన్లకు..తాను పట్టిన పంజ్ షిర్ గడ్డపై నుంచే సవాల్ విసురుతున్నారు సలేహ్. తాలిబన్లకు ఎన్నడూ తలవంచొద్దు అన్న తన గురువు అహ్మద్ షా మసూద్ చెప్పిన మాటలను ఫాలో అవుతున్నారు.
READ Panjshir : అప్ఘాన్ లకు అండగా పంజ్ షిర్ ..ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు