40 క్షణాల్లో మట్టిలో కలిసిపోయిన గ్రామం.. వీడియో ఇదిగో
ఆ గ్రామం మొత్తం ఇప్పుడు బురద, రాళ్లతో నిండిపోయింది.

ఓ అందమైన గ్రామం 40 క్షణాల్లో మట్టిలో కలిసిపోయింది. ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని స్విట్జర్లాండ్‌లోని లోట్స్‌చెంటర్ లోయ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్లాటెన్ గ్రామంపై హిమానీనదం పడింది. ఆ గ్రామంపై పెద్ద ఎత్తున మట్టిదిబ్బలు పడ్డాయి.
ఈ విపత్తు సంభవిస్తుందని ముందుగానే గుర్తించిన అధికారులు కొన్ని రోజుల క్రితమే ఆ గ్రామంలోని సుమారు 300 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. ఆ గ్రామంలోని ఓ వృద్ధుడి ఆచూకీ మాత్రం తెలియడం లేదని సమాచారం.
ఆ గ్రామం మొత్తం ఇప్పుడు బురద, రాళ్లతో నిండిపోయింది. హిమచరియలు ఇప్పటికీ పడుతున్నాయని అధికారులు చెప్పారు. జారిపడ్డ మట్టిపెళ్లల వల్ల లోన్జా నదిలో అలజడి చెలరేగుతోందని వివరించారు. దిగువ ప్రాంతాలను నదీజలాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది.
ఇవాళ ఆ ప్రాంతంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు కరెన్ కెల్లర్ సూటర్ పర్యటిస్తారు. ఈ విపత్తు సంభవించడానికి వాతావరణ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గ్లేసియర్లు కరుగుతున్నాయి.