Hamas Hostage: హమాస్ మరో వీడియో విడుదల.. తీవ్ర గాయాలతో ఇజ్రాయెల్ మహిళ.. ఏం చెప్పిందంటే?

హమాస్ తాజాగా విడుదల చేసిన వీడియోపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందించింది. మియా కిడ్నాప్ నిజమేనని ధృవీకరించింది.

Hamas Hostage: హమాస్ మరో వీడియో విడుదల.. తీవ్ర గాయాలతో ఇజ్రాయెల్ మహిళ.. ఏం చెప్పిందంటే?

Israel-Hamas War

Updated On : October 17, 2023 / 11:25 AM IST

Hamas Releases Video : పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్ – ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు పదిరోజులుగా కొనసాగుతూనే ఉంది. గాజాలో పాగావేసిన హమాస్ మిలిటెంట్లను హతమార్చే లక్ష్యంగా గాజాస్ట్రీప్ పై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకొని దాడుల నుంచి తప్పించుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. తమ చెరులో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారని హమాస్ ప్రకటించింది. అందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులుకూడా ఉన్నారని చెప్పింది. తాజాగా హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఓ మహిళ చేతికి గాయంతో బాధపడుతూ కనిపించింది.

Read Also : Joe Biden Visit Israel : రేపు ఇజ్రాయెల్‌లో జో బిడెన్ పర్యటన…గాజా పౌరులకు మానవతా సాయంపై చర్చ

హమాస్ విడుదల చేసిన వీడియోలో కనిపించే యువతి పేరు మియా షెమ్. ఈమెకు 21ఏళ్లు. ఈ వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడింది. నన్ను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి విడిపించండి అంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది. మియాది గాజా సరిహద్దులోని షోహమ్ అనే ప్రాంతం. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నానని, అక్టోబర్ 7న హమాస్ దాడి సమయంలో నేను రీమ్ కిబుట్జ్ లో జరిగిన సూపర్ నోవా మ్యూజిక్ పార్టీలో పాల్గొన్నట్లు వీడియో మియా చెప్పింది. ఆ సమయంలో నా చేతికి గాయమైందని, గాజాలో నాకు మూడు గంటలు సర్జరీ జరిగిందని తెలిపింది. వాళ్లు నన్ను బాగానే చూసుకుంటున్నారు, మందులు ఇస్తున్నారు.. అయితే.. నన్ను త్వరగా విడిపించండి.. మా అమ్మానాన్నల దగ్గరకు తీసుకెళ్లండి అంటూ మియా షెమ్ వీడియోలో ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ వీడియోను హమాస్ మిలిటరీ విభాగమైన  ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ టెలిగ్రామ్ లో విడుదల చేసినట్లు తెలిసింది. దీనిని హమాస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

హమాస్ తాజాగా విడుదల చేసిన వీడియోపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందించింది. మియా కిడ్నాప్ నిజమేనని ధృవీకరించింది. హమాస్ విడుదల చేసిన వీడియో వైరల్ కావటంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మియా కుటుంబాన్ని సంప్రదించి వివరాలు సేకరించింది. మియాతో పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారందరినీ విడిపించేందుకు మేం అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని ఐడీఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఇంతకుముందు కూడా హమాస్ మిలిటెంట్లు ఇలాంటి వీడియోలను విడుదల చేసిన విషయం తెలిసిందే.