బంగ్లాదేశ్‌లో మతపరంగా సెక్స్ వర్కర్ అంత్యక్రియలు

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 07:30 PM IST
బంగ్లాదేశ్‌లో మతపరంగా సెక్స్ వర్కర్ అంత్యక్రియలు

Updated On : February 12, 2020 / 7:30 PM IST

బంగ్లాదేశ్‌లో మతపరంగా ఓ సెక్స్ వర్కర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. దీర్ఘకాలంగా ఉన్న నిషేధాన్ని పట్టించుకోకుండా అంత్యక్రియలు జరగడం పలువురు స్వాగతించారు. దౌలత్డియా గ్రామం అతిపెద్ద వేశ్యాగృహాల్లో ఒకటి. ఇక్కడ హమీదా బేగం (65) అనారోగ్యంతో కన్నుమూశారు. చనిపోయే సెక్స్ వర్కర్లను ప్రార్థనలు లేకుండానే..సమాధి చేయడం లేదా..నదులలో పడవేస్తుంటారు.

అయితే..అంత్యక్రియల సందర్భంగా ప్రార్థనలు నిర్వహించేందుకు ఇమామ్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పోలీసులు కూడా పాల్గొన్నారు. అంత్యక్రియల్లో పాల్గొనడాన్ని ఇస్లాం నిషేధిస్తుందా అనే ప్రశ్నలు వినిపించాయి. ఇమామ్ మొదట్లో ప్రార్థనలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని పోలీసు అధికారి రెహ్మాన్ వెల్లడించారు.

చివరకు అంత్యక్రియల్లో ప్రార్థనలు నిర్వహించేందుకు నిర్ణయించారని, దీంతో వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారని తెలిపారు. అక్కడి సెక్స్ వర్కర్లు కన్నీళ్లతో బేగంకు వీడ్కోలు పలికారన్నారు. 

బేగం సమాధి వద్ద ఆమె కొడుకు ముకుల్ సీఖ్, 35 ఏళ్ల కుమార్తె లక్ష్మీ పాల్గొని ప్రార్థనలు చేశారు. కూతురు లక్ష్మీ వేశ్యా గృహంలో సెక్స్ వర్కర్. తన తల్లికి ఇంత గౌరవప్రదమైన వీడ్కోలు వస్తుందని తాను ఊహించలేదని కూతురు లక్ష్మీ ఆవేదనతో తెలిపింది. ఇక్కడ ఉన్న మహిళలు చనిపోతే..ఇలాగే అంత్యక్రియలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. 

బంగ్లాదేశ్‌లో సెక్స్ చట్టబద్ధమైంది. బంగ్లాదేశ్‌లో చట్టబద్ధం చేసిన 12 వేశ్యా గృహాల్లో దౌలత్డియా ఒకటి. రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.