Af
Haqqani Network అఫ్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం తాలిబన్ సంస్థలో నలుగురు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరు ముల్లా యాకూబ్. తాలిబన్ వ్యవస్థాపకుడు మూల్లా మహమ్మద్ ఒమర్(ఇతనిని ఒంటికన్ను ఒమర్ అని కూడా పిలుస్తారు)కుమారుడే ఈ ముల్లా యాకూబ్. ప్రస్తుతం అఫ్ఘానిస్తాన్ లో అధికారం పంచుకునే విషయంలో హక్కానీ నెట్ వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ నుంచి ముల్లా యాకూబ్ కి బలమైన పోటీ వస్తోంది.
తాలిబన్లు తమ దేశం పేరును ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ గా నామకరణం చేసినా.. గ్రూపు తగాదాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. తాలిబన్లలో భాగమైన హక్కానీ నెట్‌వర్క్ అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
నిజానికి తాలిబన్లు శుక్రవారం ప్రార్థనల తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా.. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. హక్కానీ నెట్‌వర్క్ నేతలు అందుకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ప్రభుత్వ ప్రకటనను తొలుత శనివారానికి.. ఆ తర్వాత ఒక వారం పాటు వాయిదా వేశారు.
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్-హక్కానీ నెట్ వర్క్ మధ్య ప్రస్తుతం విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. అఫ్ఘానిస్తాన్ ని చేజిక్కించుకోవడంలో తాలిబన్లతో కలిసి పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్ . . . కొత్తగా ఏర్పడనున్న తాలిబన్ ప్రభుత్వంలో రక్షణ శాఖతో పాటు పలు కీలక శాఖల కోసం పట్టుబడుతోందని సమాచారం. హక్కానీ నెట్‌వర్క్ లో కీలక వ్యక్తులుగా అమెరికాకు మోస్ట్‌వాంటెడ్ అయిన ఖలీల్ హక్కానీ, అతని సోదరుడి కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ, మరోనేత అనాస్ హక్కానీ ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని తమకే ఇవ్వాలని వీరు పట్టుబడుతున్నారని సమాచారం. మరోవైపు, అఫ్ఘాన్ మొత్తాన్ని ఆక్రమించినా.. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో తాలిబన్లు ఇప్పటివరకు పాగా వేయకపోయారు. ప్రస్తుతం హక్కానీ నెట్‌వర్క్ పంజ్‌షీర్ రెబెల్స్‌పై యుద్ధంలో యాక్టివ్‌గా ఉంది.
READMullah Baradar : అప్ఘాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ముల్లా బరాదర్ ఎవరో తెలుసా!
హక్కానీ నెట్ వర్క్ ఏంటి-పాక్ తో సంబంధాలు-భారతీయులు లక్ష్యంగా దాడులు
హక్కానీ నెట్ వర్క్ ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అనుబంధ సంస్థగానే విశ్లేషకులు భావిస్తారు. తాలిబన్ లో భాగమని చెప్పినా.. ఇతర లక్ష్యాలపై కూడా ఇది పనిచేస్తుంది. 1980ల్లో జలాలుద్దీన్ హక్కానీ అనే వ్యక్తి హక్కానీ నెట్ వర్క్ ని స్థాపించాడు. ఇతను మాజీ ముజాహిద్దీన్ కమాండర్. 1980ల్లో అఫ్ఘానిస్తాన్ లో సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇతనికి అమెరికా నిఘా సంస్థ సిఐఏ శిక్షణ ఇచ్చింది. పాకిస్తాన్ లోని వజీరిస్థాన్ ప్రాంతంలోని జద్రాన్ తెగ వారు ఎక్కువగా ఉన్నారు. 10 వేల మంది దాకా ఉగ్రవాదులు ఈ గ్రూప్ లో ఉన్నారు.
1996 లో తాలిబన్..అఫ్ఘానిస్తాన్ ని చేజిక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జలాలుద్దీన్ హక్కానీ సరిహద్దులు, ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో తాలిబన్లలో అయన పరపతి గణనీయంగా పెరిగింది. 9/11 దాడుల తర్వాత అఫ్ఘానిస్తాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో తాలిబన్ లతో కలిసి నాటో దళాలపై హక్కానీ నెట్ వర్క్ దళాలు దాడులు చేశాయి. బిన్ లాడెన్ ని అఫ్ఘానిస్తాన్ నుంచి పాకిస్తాన్ కి తరలించడంలో హక్కానీ నెట్ వర్క్ పాత్ర ఉంది. అమెరికా దాడుల్ని తప్పించుకోవడానికి పాక్ లోని ఉత్తర వజీరిస్థాన్ లో హక్కానీ తీవ్రవాదులు దాక్కున్నట్లు అమెరికా అనుమానించింది. జలాలుద్దీన్ హక్కానీ పాకిస్తాన్ లో శరణు పొందాడు. ఇక తాలిబన్లకు పాక్ ఆశ్రయం ఇచ్చింది.
READ Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!
2012లో పాకిస్తాన్ లోని వజీరిస్థాన్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు. బద్రుద్దీన్ హక్కానీ చనిపోయాడు. మరో కుమారుడు నసీరుద్దీన్ హక్కానీ కూడా 2013 లో ఇస్లామాబాద్ దగ్గర్లో హత్యకు గురయ్యాడు. ఇతడు హక్కానీ నెట్ వర్క్ లో కీలకమైన వ్యక్తి. సౌదీ,యూఏఈ వంటి దేశాల నుంచి నిధులు సమకూర్చేవాడు
ఈ సమయంలోనే 2013లో తాలిబన్ వ్యవస్థాపకుడు మూల్లా మహమ్మద్ ఒమర్ చనిపోయాడు. ముల్లా ఒమర్ చనిపోయిన విషయం 2015లో ప్రపంచానికి తెలిసింది. ఈ సమయంలో జలాలుద్దీన్ హక్కానీ కింగ్ మేకర్ గా ఎదిగాడు. ముల్లా అక్తర్ మహమ్మద్ మన్సూర్ ని తాలిబన్ చీఫ్ చేయగా…జలాలుద్దీన్ హక్కానీ తన మరో కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీని రెండో ర్యాంక్ కి ప్రమోట్ చేశాడు. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కి చెందిన కీలక వ్యక్తులతో కలిసి పనిచేసిన సిరాజుద్దీన్ హక్కానీ అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు.
2018లో జలాలుద్దీన్ హక్కానీ చనిపోవడంతో అయన స్థానాన్ని కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం తాలిబన్ లో డిప్యూటీ అమీర్ గా సిరాజుద్దీన్ హక్కానీ కొనసాగుతున్నారు. సిరాజ్ మేనల్లుడు ఖలీల్ హక్కానీ చేతిలోనే ప్రస్తుతం కాబుల్ రక్షణ బాధ్యతలు ఉన్నాయి. ఇతడు కూడా అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
కొన్నేళ్లుగా అఫ్ఘానిస్తాన్ లో మైనారిటీలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది హక్కానీ నెట్ వర్క్. భారతీయులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులకు పాల్పడింది. 2008లో భారత దౌత్య కార్యాలయం పైకి దాడి ఈ గ్రూప్ పనే. ఈ ఘటనలో 58 మంది మరణించారు. ఇదేకాకూండా పలు ఆత్మాహుతి దాడులు,బాంబు పేలుళ్లకు పాల్పడింది ఈగ్రూప్. ఇటీవల కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆత్మాహుతి దాడులు జరిపిన ఐసిస్-కే ఉగ్ర సంస్థతో కూడా హక్కానీ నెట్ వర్క్ కి మంచి సంబంధాలు ఉన్నాయి.
READTaliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!