Mullah Baradar : అప్ఘాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ముల్లా బరాదర్ ఎవరో తెలుసా!

మరికొద్ది గంటల్లో అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఖతార్ రాజధాని దోహలో..అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు(నిర్మాణం,పేరు సహా)గురించి

Mullah Baradar : అప్ఘాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ముల్లా బరాదర్ ఎవరో తెలుసా!

Mullah

Mullah Abdul Ghani Baradar మరికొద్ది గంటల్లో అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఖతార్ రాజధాని దోహలో..అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు(నిర్మాణం,పేరు సహా)గురించిన చర్చలు వేగంగా జరుగుతున్నాయని తాలిబన్లు ప్రకటించారు. అప్ఘానిస్తాన్ లోని రాజకీయ పార్టీలు మరియు అంతర్జాతీయ సమాజంతో కూడా తాము మాట్లాడుతున్నామని తాలిబన్ సంస్థలోని ఉన్నతస్థాయి వ్యక్తి ఒకరు తెలిపారు. మరికొద్ది గంటల్లోనే అప్ఘాన్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారన్నదానిపై తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే తాలిబన్ సంస్థ సహ వవ్యవస్థాపకుడు మరియు తాలిబన్ వ్యవస్థాపకుడికి బావమరిది అయిన ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్ అప్ఘానిస్తాన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు ఎవరీ ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్

53 ఏళ్ల ముల్లా బారదార్‌… అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ నగరంలో పెరిగారు. ఈ ప్రాంతంలోనే తాలిబన్ల ఉద్యమం పురుడు పోసుకుంది. 1970 ల చివర్లో అప్ఘానిస్తాన్ లో సోవియట్ దండయాత్ర ద్వారా క్లిష్టమైన జీవితాన్ని గడిపిన బరదార్ తిరుగుబాటుదారుడిగా ఎదిగాడు. 1980 వ దశకంలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక కన్ను కలిగిన తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌తో కలిసి సోవియెట్ సేన‌పై బరాదర్ పోరాడాడని చెప్పుకుంటారు. ముల్లా ఒమర్ సోదరిని బరాదర్ వివాహం చేసుకున్నారు.

1990 లలో సోవియట్ యూనియన్ అప్ఘానిస్తాన్ నుండి వైదొలగింది. సోవియెట్ సేన‌లు అఫ్ఘాన్‌ను విడిచి వెళ్లిపోయాక అక్క‌డ అంత‌ర్యుద్ధం రాజ్య‌మేలింది. సోవియట్ సేనలు వెళ్లిపోవడంతో అప్ఘానిస్తాన్ లో ఏర్పాటైన తాత్కాలిక ముజాహిద్దీన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది. కిడ్నాప్ లు చేయడం,ప్రజలపై భారీగా పన్నులు విధించడం వంటివి ముజాహిద్దీన్ లు చేయడంతో వారి పాలనపై అప్ఘాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముజాహిద్దీన్ లపై అప్ఘాన్ ప్రజలు రగిలిపోతున్న సమయం అది. అప్పుడు అప్ఘానిస్తాన్ లో అంతర్యుద్ధం కొనసాగుతుండింది. ఈ సమయంలో 1994లో తాలిబాన్లను ఏర్పాటు చేసిన నలుగురిలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఒకరు. ముల్లా ఒమర్ తో కలిసి తాలిబాన్ సంస్థ ఏర్పాటులో బరాదర్ చాలా ప్రముఖ పాత్ర పోషించాడని చెబుతుంటారు. తాలిబాన్ సంస్థ ఏర్పాటు తర్వాత బరాదర్ ఒక కమాండర్‌గా, వ్యూహకర్తగా కీలక పాత్రలు పోషించారు. ముల్లా ఒమర్ సజీవంగా ఉన్న సమయంలోనే ఆయన తాలిబాన్ల నిధుల సేకరణ, రోజువారీ కార్యకలాపాలకు బాధ్యులుగా ఉన్నారు. తాలిబాన్ల ఖర్చుల చిట్టా మొత్తం బరాదర్ చూసుకునేవారు. 1996 నుంచి 2001 వరకు అప్ఘానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. 2001లో అమెరికా నేతృత్వంలో అఫ్గానిస్తాన్ మీద దాడులు జరిగి, తాలిబాన్లు అధికారం కోల్పోయినపుడు నాటో బలగాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వం వహించారు. తాలిబాన్లు అధికారం కోల్పోయిన సమయంలో తాలిబాన్ల ప్రభుత్వంలో బరాదర్ రక్షణ శాఖ ఉప మంత్రిగా ఉన్నారు.

2001 డిసెంబర్ లో హ‌మిత్ ఖ‌ర్జాయ్‌.. అప్ఘాన్‌కు ప్రెసిడెంట్ అయ్యారు. ఆ స‌మ‌యంలో.. తాలిబన్ తిరుగుబాటుదారులు ఖ‌ర్జాయ్‌ని క‌లిసి.. మిలిటెంట్ల‌కు కూడా దేశాన్ని ప‌రిపాలించే అవ‌కాశం విష‌య‌మై డీల్ కుదుర్చుకున్నారు. ఆ తిరుగుబాటుదారుల‌లో బరాదర్ కూడా ఉన్నాడు. అయితే అదే సమయంలో అప్ఘానిస్తాన్ లోకి అమెరికా సేనలు ప్రవేశించడంతో కాబూల్ విడిచి పారిపోయాడు బరాదర్. 2010 లో పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో ముల్లా బరదార్‌ను పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచే పాక్‌ జైలులోనే ఉన్న ముల్లా బరదార్. 2018లో శాంతి చర్చలను ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వ ఒత్తిడితో అప్పటి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కొంతమంది బందీల విడుదలకు సంబంధించి ఒక జాబితాను ప్రచురించింది. వారిలో బరాదర్ పేరు కూడా ఉంది. 2018 అక్టోబర్‌ 24న బరాదర్ ని అమెరికా విజ్ణప్తి మేరకు జైలు నుంచి విడుదల చేసింది పాకిస్తాన్.

2013లోనే తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ అనారోగ్య కారణాలతో చనిపోవడంతో..పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఖతార్‌కు వెళ్లిన ముల్లా బరాదర్.. అక్కడే తాలిబన్ల రాజకీయ పార్టీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి దోహాలో అమెరికన్లతో కీలక చర్చలను ఆయనే పర్యవేక్షించారు. మార్చి 2020లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాలిబ‌న్ మిలిటెంట్ గ్రూప్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అఫ్ఘాన్‌లో హింసను వెంట‌నే ఆపేయాల‌ని ఆయ‌న కోరారు. అఫ్ఘాన్‌లో యుద్ధం ముగించాల‌ని ట్రంప్‌.. అబ్దుల్ ఘ‌నీకి స్ప‌ష్టం చేశారు. దానికి సంబంధించిన చ‌రిత్రాత్మ‌క యూఎస్‌, తాలిబ‌న్ ఒప్పందం ఫిబ్ర‌వ‌రి 29న జ‌రిగింది. అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను పూర్తిగా తొలగించాలని కోరుతూ అమెరికా ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేయడాన్ని కూడా బరాదర్ పర్యవేక్షించారు. దీంతో ఒక్క‌సారిగా అబ్దుల్ ఘ‌నీ వార్త‌ల్లోకెక్కారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోతుంది.

Read Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!

Read Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!