అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‎కు అనారోగ్యం ముప్పు..! ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే..

కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ.. వారి ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి.

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‎కు అనారోగ్యం ముప్పు..! ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే..

Sunita Williams : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపబోతోంది. సునీతా విలియమ్స్ తో పాటు బ్యారీ విల్మోర్ గత నెల 5న అంతరిక్షంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం 10 రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సమస్య ఏర్పడింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు దాదాపు నెల రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.

మైక్రో గ్రావిటీ, రేడియేషన్ ఎక్స్ పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముక సాంద్రత తగ్గుతుంది. వెన్నుముక, తొడ ఎముక, పొత్తి కడుపు ఎముకల బరువు తగ్గిపోతుంది. కిడ్నీల వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. క్యాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎదురవుతుంది. దృష్టిలోపం వచ్చే సమస్యలు వెంటాడతాయి. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.

కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ.. వారి ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇక ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలోకి స్పేస్ బగ్ ఎంటర్ అయ్యింది. బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని నాసా ప్రకటించింది. మల్టీ డ్రగ్స్ రెసిస్టెంట్ అయిన ఆ బ్యాక్టీరియాతో వ్యోమగాములకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు.

సాధారణంగా అంతరిక్షంలో షెడ్యూల్ ప్రకారం ఎక్కువ రోజులు గడిపితేనే భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయనే భయం ఏర్పడుతుంది. ఇక సునీతా విలియమ్స్, విల్మోర్ 10 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది వారి మానసిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావం చేయబోతోంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 11న సునీతా విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజీ కావడం, ధ్రస్టర్స్ మొరాయించడంతో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత జూన్ 26న తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. వ్యోమనౌకలో మళ్లీ మళ్లీ సాంకేతిక సమస్యలు ఏర్పడుతుండటంతో వ్యోమగాములు ఎప్పుడు భూమికి చేరుకుంటారో నాసా చెప్పలేకపోతోంది.

అయితే వ్యోమగాములు తిరిగి రావడంతో ఆలస్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. బోయింగ్ నిర్మించిన స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకురాలేకపోతే కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కి రప్పించే లాంచ్ ప్రొవైడర్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు. సునీతా విలియమ్స్ ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారని, ఎన్నో మిషన్లను ఆమె దిగ్విజయంగా పూర్తి చేశారని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యలు సునీతా విలియమ్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేవని చెబుతున్నారు. మొత్తంగా వీలైనంత తొందరగా సునీతా విలియమ్స్, విల్మోర్ క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Also Read : ఈజీగా అంతరిక్షంలోకి వెళ్లి రావొచ్చు.. ఇండియన్స్‌కు యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఆఫర్!