నేపాల్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించారు. కస్కీ జిల్లాలో భారీవర్షాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో ఇల్లు కూలి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్ర గాయాలవడంతో వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
లాంజంగ్ జిల్లాలో వరదలకు ముగ్గురు కన్నుమూయగా… రుకుం జిల్లా అత్ బిస్కట్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా నేపాల్ లోని నారాయణి, ఇతర ప్రధాన నదులు విపరీతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. రాగల 48 గంటల్లో రుతుపవనాల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.