Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులుసహా ఎనిమిది మంది మృతి
సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా ఎనిమిది మంది మృతిచెందారు.

Helicopter crash
Ghana Helicopter Crash: సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సహా ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన ఘనా దేశంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం z-9 యుటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్రా నుంచి సమస్యాత్మక వాయువ్య ప్రాంతమైన ఒబువాసికి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి క్రాస్ అయింది.
ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఘనా రక్షణ మంత్రి ఎడ్వర్ట్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాల ముహమ్మద్ మరణించారు. ఈ ఘటనను ఘనా ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్లో ఇద్దరు కేంద్ర మంత్రులతోపాటు ఘనా డిప్యూటీ నేషన్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మునీర్ మహమ్మద్, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ శామ్యూల్ తోపాటు ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్దారించలేదు. నిపుణుల బృందం దర్యాప్తు మొదలు పెట్టిందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ క్రాష్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు.
ఘనాలో దశాబ్ద కాలంలో జరిగిన అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటని అధికారులు తెలిపారు. 2014లో తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మరణించగా.. 2021లో రాజధాని ఆక్రాలో ఒక కార్గో విమానం రన్‌వేను దాటి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టడంతో 10మంది మరణించారని వెల్లడించారు.