HMPV Outbreak : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!
HMPV Outbreak : ఐదేళ్ల క్రితం కోవిడ్-19 మాదిరిగానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా సహా యావత్తూ ప్రపంచాన్ని బెంబేలిత్తిస్తోంది. ఇప్పటికే, భారత్‌తో సహా పలు దేశాలు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

HMPV outbreak in China
HMPV Outbreak in China : ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్లకు పైగా మరణాలకు కారణమైన కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందిన ఐదేళ్ల తరువాత, చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్ ఫ్లూ వంటి లక్షణాలతో కూడిన శ్వాసకోశ వ్యాధి. కోవిడ్ -19 తర్వాత మరో ఆరోగ్య సంక్షోభం గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది.
చైనాలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అనేక మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్ట్‌లు సూచిస్తున్నాయి. ఆస్పత్రులు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయని కూడా కొందరు పేర్కొంటున్నారు. రోజురోజుకీ ఈ వైరస్ బారినపడి అనేక మంది ఆస్పత్రి పాలవుతున్నారు. చైనాలో ఈ వైరస్ ఉధృతితో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది.
ఐదేళ్ల క్రితం కోవిడ్-19 మాదిరిగానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా సహా యావత్తూ ప్రపంచాన్ని బెంబేలిత్తిస్తోంది. ఇప్పటికే, భారత్‌తో సహా పలు దేశాలు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. కానీ, ఈ వైరస్ నిజంగా ప్రమాదకరమైనదా? ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా?
ఈ వైరస్ కోవిడ్-19 వైరస్‌ని పోలి ఉంటుందా? దాని లక్షణాలు ఏంటి? ఆరోగ్య నిపుణులు ఇప్పటివరకు ఏం చెప్పారు? హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ ఉందా? ఇలాంటి మరెన్నో విషయాలను లోతుగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) అంటే ఏంటి? :
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) అనేది ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. ఇది దిగువ లేదా ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు (జలుబు వంటిది) కారణమవుతుంది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV), ఫ్లూ మాదిరిగానే ఇది సాధారణంగా శీతాకాలంలో లేదా వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కాలానుగుణ వ్యాధిగా చెప్పవచ్చు.
హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదా? :
హెచ్ఎంపీవీ కొత్తగా కనుగొన్న వైరస్ కాదు. ఇది మొదటిసారిగా 2001లో కనుగొన్నారు. ఇదే విషయాన్ని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. అయినప్పటికీ, కొన్ని సెరోలాజిక్ ఆధారాలు కనీసం 1958 నుంచి ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిందని సూచిస్తున్నాయని ఒక నిపుణుడు చెప్పారు. హెచ్ఎంపీవీ ఆర్ఎస్‌వీతో పాటు న్యుమోవిరిడే కుటుంబంలో వస్తుంది.
హెచ్ఎంపీవీ కోవిడ్-19 వైరస్ లాంటిదేనా? :
అవును. కరోనావైరస్ వ్యాధి లేదా కోవిడ్-19 అనేది (SARS-CoV-2) వైరస్ వల్ల కలిగే ఒక అంటు వ్యాధి. హెచ్ఎంపీవీ వైరస్, (SARS-CoV-2) వైరస్ కొన్ని మార్గాల్లో ఒకేలా ఉంటాయి.
1. రెండు వైరస్‌లు అన్ని వయసులవారిలో శ్వాసకోశ వ్యాధిని కలిగిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
2. ఈ రెండింటి వైరస్ లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. సాధారణంగా హెచ్ఎంపీవీతో సంబంధం ఉన్న లక్షణాలు దగ్గు, జ్వరం, నాసికా రద్దీ, శ్వాస ఆడకపోవడం ఉంటాయి. ఇవి కూడా కోవిడ్-19 వైరస్ సోకిన వ్యక్తులు చూపించే లక్షణాల మాదిరిగానే ఉంటాయి.
3. కోవిడ్, హెచ్ఎంపీవీ రెండు వైరస్‌లు దగ్గు, తుమ్ములతో దగ్గరి వ్యక్తిగత పరిచయం నుంచి వచ్చే స్రావాల ద్వారా సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తాయి. వైరస్‌లను కలిగి ఉన్న వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం ద్వారా నోరు, ముక్కు లేదా కళ్లను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి.
4. సైన్స్ డైరెక్ట్ ప్రకారం.. కోవిడ్-19 ఉష్ణోగ్రత-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది. అందువల్ల కాలానుగుణంగా ఉంటుంది. అదేవిధంగా, హెచ్ఎంపీవీ విభిన్న వార్షిక సీజన్లలో వ్యాపిస్తుందని యూఎస్ సీడీసీ తెలిపింది. హెచ్ఎంపీవీని ఏడాది పొడవునా గుర్తించగలిగినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్‌లో సాధారణంగా శీతాకాలం చివరి నుంచి వసంతకాలం ప్రారంభం వరకు అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి.
హెచ్ఎంపీవీ వ్యాప్తిని నిరోధించే వ్యాక్సిన్ ఉందా? :
లేదు. ప్రస్తుతానికి టీకా లేదు. యాంటీవైరల్ చికిత్స సిఫార్సు చేయరు. కానీ, రోగులు ఈ జాగ్రత్తల ద్వారా హెచ్ఎంపీవీ, ఇతర శ్వాసకోశ వైరస్‌ల వ్యాప్తిని నిరోధించడంలో సాయపడుతుంది.
- కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో తరచుగా చేతులు కడుక్కోండి
- కడుక్కోని చేతులతో కళ్లు, ముక్కు లేదా నోటిని తాకడం మానుకోండి.
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి.
- జలుబు వంటి లక్షణాలు ఉన్న రోగులు దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలి.
- ఇతరులతో కప్పులు పంచుకోవడం, పాత్రల్లో ఆహారాన్ని తినడం మానుకోండి.
హెచ్ఎంపీవీ వ్యాప్తిపై భారత్ ఆందోళన చెందాలా? :
చైనాలో (HMPV) వ్యాప్తిపై ఆందోళనల మధ్య, ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ మాట్లాడుతూ.. ప్రస్తుత వైరస్ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలు సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
దేశంలో శ్వాసకోశ వ్యాప్తికి సంబంధించిన డేటాను తాము విశ్లేషించామన్నారు. 2024 డేటాలో అలాంటి గణనీయమైన పెరుగుదల లేదన్నారు. శీతాకాలంలో, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయని, మా ఆస్పత్రులు అవసరమైన వైద్య పరికరాలు, పడకలతో పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
“సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాను. అంటే.. దగ్గు, జలుబు ఉన్నవారు వ్యాప్తి నివారణకు ఇతర వ్యక్తులతో కలవకుండా ఉండాలి. జలుబు, జ్వరానికి సూచించిన సాధారణ మందులను తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు ”అని డాక్టర్ గోయెల్ పేర్కొన్నారు.

HMPV outbreak in China ( Image Source : Google )
డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ సీఈఓ డాక్టర్ అర్జున్ డాంగ్ హెచ్ఎంపీవీ సాధారణంగా ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటుందని, వ్యాప్తి త్వరగా నియంత్రించకపోతే అది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై చాలా ఒత్తిడిని కలిగిస్తుందని హెచ్చరించారు. “HMPV వైరస్ నిర్ధారణకు పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షనే ప్రామాణికం” అని డాక్టర్ డాంగ్ సూచించారు.
అప్రమత్తమైన భారత్.. వైరస్ వ్యాప్తిపై చైనా స్పందించిందా? :
అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్‌ల ద్వారా చైనాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ పరిస్థితికి సంబంధించి సకాలంలో దృష్టిసారించాలని
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను అభ్యర్థించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. “శీతాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. గత సంవత్సరంతో పోల్చితే వ్యాధులు తక్కువ స్థాయిలో వ్యాపించాయి. చైనాలోని పౌరులు, విదేశీయుల ఆరోగ్యంపై కూడా చైనా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని హామీ ఇస్తున్నాను. ఇకపై దేశంలో విదేశీయులు ప్రయాణించడం సురక్షితం” అని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.