Kirana Hills: పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేయలేదు- ఎయిర్ మార్షల్ కీలక వ్యాఖ్యలు… అసలేంటీ కిరానా హిల్స్, పాక్ అక్కడ ఏం దాచింది?
సర్గోదా వైమానిక స్థావరాన్ని భారత్ టార్గెట్ చేసినట్లు మన సైన్యం ధ్రువీకరించగానే ఆ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

Kirana Hills: ఆపరేషన్ సిందూర్ పై భారత త్రివిధ దళాధికారుల మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కిరానా హిల్స్ గురించి ప్రస్తావన వచ్చింది. కిరానా హిల్స్.. ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. అసలేంటీ కిరానా హిల్స్, అక్కడ పాకిస్తాన్ ఏం దాచింది? అనేది ఆసక్తికరంగా మారింది.
భారత త్రివిధ దళాధికారుల మీడియా సమావేశం సందర్భంగా ఒక జర్నలిస్ట్ కిరానా హిల్స్ గురించి ప్రశ్నించారు. కిరానా హిల్స్‌లోని పాకిస్తాన్ అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందా? అని అడిగారు. దానికి ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ కేకే భారతి సమాధానం ఇచ్చారు. ‘కిరానా హిల్స్‌లో అణు కేంద్రం ఉందని, పాక్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. అక్కడ ఏమున్నప్పటికీ కిరానా హిల్స్‌పై మేము దాడి చేయలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. సరిహద్దులో డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ పై దాడులకు తెగబడింది. పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆ దేశంలోని కీలకమైన సైనిక స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. 8 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. భారత్ దాడుల్లో సర్గోడాలోని ముషఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే ధ్వంసమైనట్లు సమాచారం.
కిరానా హిల్స్ కింద ఉన్న భూగర్భ అణు నిల్వలకు ఈ రన్ వే అనుసంధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ అణు స్థావరంపై భారత్ దాడి చేసినట్లు వార్తలొచ్చాయి. సర్గోదా వైమానిక స్థావరాన్ని భారత్ టార్గెట్ చేసినట్లు మన సైన్యం ధ్రువీకరించగానే ఆ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. వీటన్నింటికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి చెక్ పెట్టారు.
Also Read: వారు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసింది: జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం
అసలేంటీ కిరానా హిల్స్.. పాక్ అక్కడ ఏం దాచింది?
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోడా జిల్లాలో కిరానా కొండలున్నాయి. ఓ గ్రామం పేరు మీదుగా ఈ కొండలకు కిరానా హిల్స్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం పాక్ రక్షణశాఖకు ఎంతో కీలకం. పాక్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక రిజర్వ్ ప్రాంతంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాల కింద నిర్మించిన బలమైన కాంక్రీట్ గుహల్లో అణ్వాయుధాలను పాకిస్తాన్ నిల్వ చేసినట్లు సమాచారం. ఆ దేశం ఇక్కడ తన అణు స్థావరాన్ని నిర్వహిస్తోందనే వాదనలున్నాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా ఎయిర్‌బేస్‌కు 20 కిలోమీటర్ల దూరంలో కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పాక్ రక్షణశాఖ తమ వాయుసేన స్థావరం కోసం 1970లో కిరానా హిల్స్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇక్కడే 4091 స్క్వాడ్రన్‌తో పాటు ఒక రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 1978-79లో పాక్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజినీర్స్.. టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. అనంతర కాలంలో ఇక్కడ అణు కార్యక్రమాలకు సంబంధించి పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
దీని కోసం అనేక సొరంగాలు తవ్వారు. దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణశాఖకు చెందిన పాక్ స్పెషల్ డెవలప్‌మెంట్ వర్క్స్ ప్రత్యేక సొరంగాలు కూడా నిర్మించిందని సమాచారం. ఈ ప్రాంతంలోనే పాక్ తన అణ్వాయుధాలను నిల్వ ఉంచిందన్న ప్రచారం ఉంది.