Pakistan Pilot Captured: భారత్‌కు చిక్కిన పాకిస్తాన్ పైలట్..
వెంటనే అలర్ట్ అయిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Pakistan Pilot Capture: పాకిస్తాన్ కు చెందిన ఒక పైలట్ భారత ఆర్మీకి చిక్కినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 ఫైటర్ జెట్ పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్లు సమాచారం. రాజస్తాన్ జైసల్మేర్ లో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా, మిస్సైల్స్, డ్రోన్లతో పాకిస్తాన్ భారత్ పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. వెంటనే అలర్ట్ అయిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాదు ప్రతీకార దాడులకు దాగింది. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ బాంబుల వర్షం కురిపిస్తోంది.
పాకిస్తాన్ బరి తెగించింది. ఓవైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్.. అనూహ్యంగా భారత్ పై దాడులకు తెగబడింది. జమ్మూలోని ఎయిర్ పోర్ట్ సహా అనేక ప్రదేశాలపై మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసింది. గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది. వెంటనే భారత ఆర్మీ అలర్ట్ అయ్యింది.
దీనికి ప్రతిస్పందనగా భారత ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, జెట్లు, మిస్సైల్స్ ను భారత్ కూల్చేసింది. గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, సాంబా, ఉరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ మిస్సైల్స్, డ్రోన్లను కూల్చేసింది.
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన 48 గంటలలోపు పాకిస్తాన్ భారత్ పై దాడులకు దిగింది.