సిరియాలో టర్కీ మిలటరీ దాడిని ఖండించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 10, 2019 / 04:06 PM IST
సిరియాలో టర్కీ మిలటరీ దాడిని ఖండించిన భారత్

Updated On : October 10, 2019 / 4:06 PM IST

కుర్దుల ఆధీనంలోని ఉన్న ఉత్తర సిరియాపై టర్కీ దాడులను భారత దేశం తీవ్రంగా ఖండించింది. సిరియాపై టర్కీ ఏకపక్ష సైనిక దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం(అక్టోబర్-10,2019) భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..సిరియా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని టర్కీని కోరుతున్నామన్నారు. టర్కీ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. చర్చల ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు.
 
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈశాన్య సిరియా సరిహద్దుల నుంచి కుర్దు దళాలను తరిమికొట్టేందుకు వైమానిక దాడులకు మంగళవారం ఆదేశించారు. టర్కీ జరిపిన దాడుల వల్ల వేలాది మంది ప్రజలు తమ ఇళ్ళను వదిలిపెట్టి  తరలిపోవలసి వచ్చింది. టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం టర్కీ దళాలు 181 కుర్దిష్ లక్ష్యాలను ధ్వంసం చేశారు. టర్కీ సైనిక దాడుల్లో ఇప్పటివరకు 13మంది కుర్దిష్ ఫైటర్లు  చనిపోయారు.