45 దేశాల నుంచి 90 మంది అధికార ప్రతినిధులకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణనిస్తారు. ప్రతి దేశం నుంచి ఇద్దరు ప్రతినిధులు రావాల్సిందిగా వారిలో ఒకరు మెకానికల్ ఇంజినీర్ మరొకరు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అయుండాలట.
ఇస్రో మరో కొత్త ప్రాజెక్టుకు నాంది పలికింది. 45 దేశాలకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. యూనిస్సేస్ నానోశాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ కార్యక్రమం పేరిట భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ కె శివన్ తెలిపారు. గురువారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు రాష్ట్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా భారత్‌కు ఎంతో లాభం చేకూరనుందని అభిప్రాయపడ్డారు. దేశ విదేశాల మేధావులంతా ఒక చోట సమావేశమై శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. మొత్తం ప్రోగ్రామ్‌కు ఎంత బడ్జెట్ కేటాయించరన్న విషయం గురించి చర్చించకపోవడం గమనార్హం. బ్యాచ్‌ల వారీగా శిక్షణనివ్వనున్న నేపథ్యంలో తొలి బ్యాచ్‌లో అల్జీరియా, అర్జెంటీనా, అజెర్‌బైజాన్, భూటాన్, బ్రెజిల్, చిలె, ఈజిప్టు, ఇండోనేషియా, కజక్‌స్థాన్, మలేసియా, మెక్సికో, మంగోలియా, మొరాకో, మయన్మార్, ఒమన్, పనామా, పోర్చుగల్‌లు పాల్గొనున్నాయి.
బెంగళూరు వేదికగా జరగనున్న ఎనిమిది వారాల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి యూఆర్‌ఎస్సీ సదుపాయాలను సమకూర్చనుంది. 1-10 కేజీల వరకూ ఉండే నానో శాటిలైట్ తయారీపై శిక్షణనిస్తారట. ఇందుకుగాను మొత్తం 45 దేశాల నుంచి 90 మంది అధికార ప్రతినిధులకు మూడు బ్యాచ్‌లుగా శిక్షణనిస్తారు. ప్రతి దేశం నుంచి ఇద్దరు ప్రతినిధులు రావాల్సిందిగా వారిలో ఒకరు మెకానికల్ ఇంజినీర్ మరొకరు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అయుండాలట. పాల్గొన్న సభ్యులందరి ఖర్చులను ఇస్రో భరించేందుకు సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.