Elon Musk: బాబోయ్.. లెక్కపెట్టలేనంత జీతం..! ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ ఆఫర్.. కానీ, షరతులు వర్తిస్తాయ్.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు టెస్లా సంస్థ భారీ ఆఫర్ ఇచ్చింది. ఊహించని వేతనాన్ని ఆఫర్ చేసింది.

Elon Musk: బాబోయ్.. లెక్కపెట్టలేనంత జీతం..! ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ ఆఫర్.. కానీ, షరతులు వర్తిస్తాయ్.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

Elon Musk

Updated On : September 7, 2025 / 12:07 PM IST

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు టెస్లా సంస్థ భారీ ఆఫర్ ఇచ్చింది. ఊహించని వేతనాన్ని ఆఫర్ చేసింది. అది ఎంతో తెలిస్తే మీ కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. శుక్రవారం అమెరికన్ కంపెనీ టెస్లా సంస్థ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి సీఈవోగా కొనసాగడానికి, కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎలాన్ మస్క్‌కు భారీ వేతనంను సంస్థ ఆఫర్ చేసింది.

Also Read: CANARA Bank Recruitment: కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్: డిగ్రీ అర్హతతో ట్రెయినీ జాబ్స్.. దరఖాస్తు, పూర్తి వివరాలు

టెస్లా సంస్థ తమ సీఈవో అయిన ఎలాన్ మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.88 లక్షల 168 వేల కోట్లు) విలువైన వేతన ప్యాకేజీని ప్రతిపాదించింది. అయితే, ఈ ప్యాకేజీని అందుకోవాలంటే మస్క్ కొన్ని అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలని సంస్థ షరతులు పెట్టింది. ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్‌కు ఉంచనుంది. వాటాదారులు ఆమోదిస్తే.. కొత్త వేతన ప్యాకేజీతో ప్రపంచంలోనే మొట్టమొదట ట్రిలియన్ డాలర్ల వేతనం అందుకోనున్న సీఈవోగా మస్క్ అవతరించనున్నాడు. అయితే, చెల్లింపు నగదులో కాదు.. షేర్లలో ఉంటుంది.

కార్ల ఉత్పత్తి, షేర్ ధర, నిర్వహణ లాభంలో భారీ పెరుగుదలతో సహా కొన్ని పనితీరు లక్ష్యాలను కంపెనీ చేరుకున్నట్లయితే కంపెనీలో 12శాతం విలువైన షేర్లను డజను ప్రత్యేక ప్యాకేజీలలో ఎలాన్ మస్క్ కు అందజేస్తామని టెస్లా తెలిపింది.

ఇదిలాఉంటే..ఈ భారీ వేతనాన్ని మస్క్‌ అందుకోవాలంటే.. టెస్లాను అనేక రంగాల్లో గొప్ప విజయాలను సాధించేలా చేయాలి. ముఖ్యంగా కంపెనీ కొత్త రోబోటాక్సీ వ్యాపారాన్ని వేగంగా విస్తరించాలి. కంపెనీ మార్కెట్ విలువను నేటి దాదాపు 1ట్రిలియన్ డాలర్ల నుంచి కనీసం 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలి. సంవత్సరానికి 20 మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి. 10లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు ఉత్పత్తి చేయాలి. 10 లక్షల హ్యుమనాయిడ్ ఏఐ బాట్స్ రూపొందించాలి. కనీసం 7.5సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి. సీఈవో పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి.

ఈ ప్రణాళిక ప్రకారం.. మస్క్ అన్ని లక్ష్యాలను సాధిస్తే అతను మిలియన్ల కొద్దీ టెస్లా షేర్లను పొందుతాడు. తద్వారా కంపెనీలో అతని వాటా 25శాతానికి పెరుగుతుంది. భవిష్యత్తులో కంపెనీలో బలమైన వాటాదారుల్లో ఒకడిగా మస్క్ మారుతాడు.

ఎలాన్ మస్క్ ఒక ట్రిలియన్ డాలర్ల వేతనం ఆఫర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ..అలా జరిగితే ఇది చారిత్రాత్మకం అవుతుంది. అతను ఏలియన్ అని నిర్ధారించబడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. మస్క్ డబ్బుతో ప్రభావితం అవుతాడని నాకు అనిపించడం లేదు. డబ్బు అనేది అతనికి నిజమైన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగించే ఓ సాధనంగా ఉంటుందని పేర్కొన్నాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. భూమిపై అత్యంత ధనవంతుడు కావడమే ఎలాన్ మస్క్ లక్ష్యం అని చాలా మంది అనుకుంటారు.. వాస్తవానికి అతని లక్ష్యం అంగారక గ్రహంపై అత్యంత ధనవంతుడు కావడమే అంటూ నెటిజన్ చెప్పుకొచ్చాడు.