అంతరిక్షాన్ని చెత్తకుప్ప చేశారు : భారత్ మిషన్ శక్తిపై నాసా ఆగ్రహం

  • Publish Date - April 2, 2019 / 04:56 AM IST

అంత‌రిక్ష శ‌క్తిలో భార‌త్ సూప‌ర్ ప‌వ‌ర్‌గా మారామంటూ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మిష‌న్ శ‌క్తితో సుమారు 300 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న ఓ ఉప‌గ్ర‌హాన్ని యాంటీ శాటిలైట్ మిస్సైల్‌తో పేల్చేశామంటూ మోడీ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఈ మిష‌న్ శ‌క్తి ప్రాజెక్ట్‌పై అమెరికాకు చెందిన నాసా(నేష‌న‌ల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్) ఆందోళన వ్యక్తం చేస్తుంది. భారత్ జరిపిన ప్ర‌యోగ ప‌రీక్ష‌ ఓ పెద్ద ప్ర‌మాదంగా మారింద‌ని నాసా వెల్ల‌డించింది.

యాంటీ శాటిలైట్‌తో ఉప‌గ్ర‌హాన్ని పేల్చ‌డం వ‌ల్ల సుమారు 400 వరకు వర్ధ పదార్ధాలు త‌యారైన‌ట్లు నాసా చెప్పింది. ఈ వ్య‌ర్థాలతో అంత‌రిక్షం అత్యంత భ‌యంక‌రంగా త‌యారైందని, వ్య‌ర్ధాల వ‌ల్ల‌ వ్యోమ‌గాముల‌కు, అంత‌రిక్ష కేంద్రానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని నాసా హెచ్చ‌రించింది. అయితే ప్ర‌తి వ్య‌ర్ధాన్ని అంచ‌నా వేయ‌డం సులువు కాదని, ప‌ది సెంటీమీట‌ర్ల సైజు క‌న్నా పెద్ద‌గా ఉన్న వ్య‌ర్ధాల‌ను మాత్రమే ట్రాక్ చేస్తున్నట్లు నాసా చెప్పింది.

ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ తిరుగుతున్న క‌క్ష్యకు దిగువ క‌క్ష్య‌లోనే భార‌త్ ఓ శాటిలైట్‌ను పేల్చింది. ఇంకా చాలా వ‌ర‌కు ఉప‌గ్ర‌హాలు ఆ క‌క్ష్య క‌న్నా పైనే తిరుగుతున్నాయి. సుమారు 24 వ్య‌ర్ధాలు స్పేస్ స్టేష‌న్ క‌న్నా ఎగువ క‌క్ష్య‌లో పేరుకుపోయిన‌ట్లు నాసా చెప్పింది. స్పేస్ స్టేష‌న్ క‌న్నా ఎక్కువ‌ ఎత్తుకు వ్య‌ర్ధాలు వెళ్ల‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని నాసా చెప్పింది. ఇలాంటి పేలుళ్ల‌కు పాల్ప‌డితే.. భ‌విష్య‌త్తులో అంత‌రిక్షంలోకి మాన‌వుల‌ను తీసుకువెళ్లే ప్ర‌యోగాల‌ను నిర్వ‌హించ‌లేమ‌ని, ఉప‌గ్ర‌హాలను పేల్చివేస్తే ఎట్టిప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ంటూ నాసా చెప్పింది. ఇటవంటి ప్రయోగాల వల్ల రిస్క్ ఎక్కువ అవుతుందని నాసా చెప్పుకొచ్చింది.