International Flights : రెండేళ్ల నిషేధం తర్వాత.. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
విమాన ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్ల నిషేధం అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవనున్నాయి.

International Flights After 2 Years, India To Resume Regular International Flights From March 27
International Flights : విమాన ప్రయాణికులకు శుభవార్త.. రెండేళ్ల నిషేధం అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు కేంద్ర
విమానయాన శాఖ ప్రకటించింది. కొవిడ్ పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీలసుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిపోవడంతో కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు
ప్రకటించింది. కరోనా దెబ్బకు విమానయాన రంగం ఆర్థికంగా కుదేలైంది. తీవ్ర నష్టాల బాటపట్టింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విమానయాన రంగం ఆర్థికంగా పుంజుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల తర్వాత
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
మార్చి 27 నుంచే రెగ్యులర్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి సంప్రదింపులు జరిపిన తర్వాత విమాన సర్వీసులపై నిషేధాన్ని మార్చి 26న ముగించేందుకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో వెల్లడించింది. 2022 మార్చి 27 నుంచి విదేశాల నుంచి భారత్ కు వచ్చే విమాన సర్వీసులతో పాటు భారత్ నుంచి వెళ్లే అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
రెండేళ్ల క్రితం కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కారణంగా భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అత్యవసర సేవల్లో భాగంగా పలు దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబూల్ ఒప్పందాలతో ఈ రెండు సంవత్సరాల
పాటు పరిమిత సంఖ్యలోనే విమాన సర్వీసులు నడిచాయి. కరోనా కొనసాగుతున్న క్రమంలో రెగ్యులర్ కమర్షియల్ ఇంటర్నేషనల్ ప్యాసెంజర్ విమానాలపై కూడా నిషేధం అమల్లో ఉంది. ఫిబ్రవరి 28న కూడా అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని
కేంద్రం పొడిగించింది. అయితే ఆ నిషేధాన్ని పూర్తిగా కేంద్రం ఎత్తేయనుంది.
అప్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, బహ్రయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవూస్, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజేరియా, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక, స్విట్జర్లాండ్, తంజానియా, ఉక్రెయిన్, యూఏఈ, యూకే, ఫ్రాన్స్ దేశాలతో ఎయిర్ ట్రాన్స్‌పోర్టు బబుల్ అగ్రిమెంట్‌ను భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చేది వేసవి కాలం కావడంతో చాలా మంది టూరిస్టులు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విదేశీ పర్యటనలకు మార్గం సుగుమమైనట్టే.. ఇది విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..
Read Also : Operation Ganga : యుక్రెయిన్‌లో సుమీ నుంచి పూర్తైన భారతీయుల తరలింపు.. 12 బస్సుల్లో బయల్దేరిన విద్యార్థులు