ఇరాక్‌లో ఘోర ప్రమాదం : పడవ మునిగి 70మంది మృతి

ఇరాక్ లో కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో తీరని విషాదం. మోసుల్ దగ్గర టైగ్రిస్ నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 70మంది చనిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు స్థానికుల సాయంతో 55 మందిని కాపాడారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు.
కుర్ద్ ప్రజలు తమ సంస్కృతిని అనుసరించి కొత్త సంవత్సరం ‘నౌరుజ్’ వేడుకలు జరుపుకుంటూ ఫెర్రీపైకి ఎక్కుతారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఫెర్రీపైకి ఎక్కారు. అయితే పరిమితికి మించి ఎక్కారు. ఆ ఫెర్రీ మోసుల్ నగరం దగ్గరకు రాగానే నీట మునగడం ప్రారంభించింది. చూస్తుండగానే వాళ్లు నీళ్లలో మునిగిపోయారు. సమీపంలో బోట్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలను కాపాడటం కష్టమైపోయింది. అందుబాటులో ఉన్న బోట్లతోనే కొందరిని కాపాడే లోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఇరాక్ ప్రధాని అబ్దుల్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు.