వెనక్కి తగ్గని హమాస్-ఇజ్రాయెల్.. పశ్చిమాసియాలో యుద్ధం ఆగేదెప్పుడు?
తన ఇంటిపై డ్రోన్ దాడిని తీవ్రమైన తప్పుగా అభివర్ణించారు. ఇరాన్ అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ప్రతిజ్ఞ చేశారు.

Israel Hamas Conflict : యాహ్యా సిన్వార్ మరణంతో గాజా యుద్ధం ఆగిపోతుందా? ఇజ్రాయెల్ శాంతిస్తుందా? ఏడాది దాటినా ఆగని మారణహోమం ఇకనైనా చల్లారుతుందా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ తలెత్తున్న ఆసక్తికర ప్రశ్నలు ఇవే. కానీ, ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. బందీలను విడిచిపెడితే యుద్ధం ముగిసినట్లే అని ఇజ్రాయెల్.. యుద్ధం ముగిశాకే బందీలను విడుదల చేస్తామని హమాస్ తేల్చి చెబుతున్నాయి.
మరి హమాస్, ఇజ్రాయెల్ ఇస్తున్న స్టేట్ మెంట్లతో మరోసారి యుద్ధం కొనసాగుతుందా? లేక ఎండ్ కార్డు పడుతుందా? ఇప్పటికే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ అధినేత సిన్వార్ మృతి చెందినట్లు హమాస్ సైతం ధృవీకరించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. సిన్వార్ ను కోల్పోయినా.. యుద్ధంలో తగ్గేది లేదంటోంది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రతిపాదనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమ ప్రాంతంపై బాంబు దాడులు ఆపి దళాలను ఇజ్రాయెల్ ఉపసంహరించుకుని యుద్ధం ముగించే వరకు బందీలను వదిలేది లేదని హమాస్ తేల్చి చెబుతోంది. మరోవైపు హమాస్ నేత సిన్వార్ మరణ
వార్తను కన్ ఫర్మ్ చేసుకున్నాక.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
సిన్వార్ మరణంతో గాజాలో యుద్ధం ఆగినట్లు కాదు, యుద్ధం చివరి అంకానికి ఇది ఆరంభం మాత్రమే అని తెలిపారు. గాజా ప్రజలకు తాను చెప్పేది ఒక్కటే అని, ఈ యుద్ధం రేపు ఆగిపోగలదని, కాకపోతే హమాస్ ఆయుధాలను వదిలేసి, ఇజ్రాయెలీ బందీలను వదిలి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. లేదంటే వేటాడి మరీ హతమారుస్తామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. తన ఇంటిపై డ్రోన్ దాడిని తీవ్రమైన తప్పుగా అభివర్ణించారు. ఇరాన్ అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదులను, వారిని పంపించే వారిని నిర్మూలించడాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తుందన్నారు. కాగా, డ్రోన్ దాడి సమయంలో ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియాలోని తన నివాసంలో నెతన్యాహు లేరు.
Also Read : మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లేనా? ప్రపంచం ఇక రోజులు లెక్క పెట్టాల్సిందేనా?