ఇజ్రాయెల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. ఇరాన్ లో అంతర్యుద్ధం? సుప్రీం లీడర్ పై ప్రజల్లో వ్యతిరేకగళం…

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇదే సమయంలో ఇరాన్ లో కొత్త సమస్య తెరపైకి వచ్చింది.

ఇజ్రాయెల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. ఇరాన్ లో అంతర్యుద్ధం? సుప్రీం లీడర్ పై ప్రజల్లో వ్యతిరేకగళం…

Israeli PM Benjamin Netanyahu

Updated On : June 18, 2025 / 6:51 PM IST

Israel-Iran War: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం బుధవారం ఆరో రోజుకు చేరుకుంది. పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారు జామున టెహ్రాన్ లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. అటు టెల్ అవీవ్ లోనూ పేలుళ్లు సంభవించాయి. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ లో కొత్త సమస్య తలెత్తుతోంది.

 

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తమకు తెలుసు.. ఆయన భేషరతుగా లొంగిపోవాలి.. లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా ఖమేనీ ‘యుద్ధం మొదలైంది’ అంటూ పోస్టు చేశాడు. ఇలాంటి సమయంలో ఇరాన్ లో కొత్త సమస్య పుట్టుకొస్తున్నట్లు సమాచారం. ఇరానీయన్లు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా పెద్దెత్తున గళం విప్పుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఖమేనీ తన కీలక అధికారాలను ఇరాన్ మిలిటరీ సుప్రీం కౌన్సిల్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి అప్పగించినట్లు తెలిసింది.

 

ఇరాన్ ఇన్‌సైట్ ప్రకారం.. ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడంతో.. ఖమేనీ అతని కుమారుడు మోజ్తాబాతో సహా అతని సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు ఈశాన్య టెహ్రాన్‌లోని భూగర్భ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఖమేనీ అధికారాలన్నీ సైన్యానికి బదలాయించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపిస్తున్న వేళ ఇరానియన్లు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా పెద్దెత్తున గళం విప్పుతున్నారని, ఆ దేశంలో తొమ్మిది కోట్ల జనాభా ఉండగా.. వీరిలో సగానికిపైగా ప్రజలు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నారని, ఇప్పటికే ఇజ్రాయెల్ కు ఇరానియన్ల నుంచి సహకారం అందుతుందని, అందుకే ఖమేనీ తన అధికారాలను సైన్యానికి బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

ఈనెల జూన్ 12న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జెరూసలేం పశ్చిమ గోడ‌పై తన చేతితో రాసిన నోట్‌ను ఉంచిన విషయం తెలిసిందే. ఆ నోట్‌లో ‘ప్రజలు గొప్ప సింహంలా లేస్తారు..’ అని ఉంది. తొలుత ఇజ్రాయెల్ ప్రజలు ఇరాన్‌కు వ్యతిరేకంగా సింహాల్లా పోరాడాలని పిలుపుగా అర్థం చేసుకున్నారు. కానీ, ఇరాన్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో కొందరు ఇజ్రాయెల్ ప్రధాని లేఖపై కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఇరానియన్లు తమ సొంత నాయకత్వానికి వ్యతిరేకంగా సింహాల్లా పోరాడటానికి సిద్ధమవుతున్నారని కూడా సూచిస్తుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ నోట్ మరుసటి రోజు జూన్ 13న ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించింది.

‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ మద్దతుదారులు ఆ పేరు వెనక ఉన్న అర్ధాన్ని తెలుపుతూ.. “రైజింగ్ లయన్ అనేది ఆపరేషన్ కు ఒక అందమైన పేరు. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ శత్రువు కాదని గుర్తుచేస్తుంది. 1979కి ముందు ఉన్న స్థితికి ఎదగడానికి శాంతి, స్నేహం కోసం ఎదురు చూస్తుంది” అని ప్రొఫెసర్, సీనియర్ రీసెర్చ్ ఫెలో యూజీన్ కొంటోరోవిచ్ రాశారు.

ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి మాజీ అధిపతి, ఐడిఎఫ్ రిజర్వ్ మేజర్ జనరల్ గియోరా ఐలాండ్ న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరానియన్ల నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం పొందుతుందని అన్నారు. ఇందులో మూడు స్థాయిల ఇరానియన్లు ఉన్నారని ఐలాండ్ పేర్కొన్నాడు. అధికశాతం మంది ఇరాన్ ప్రజలు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు. వారంతా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌లో స్వేచ్ఛాయుత పాలన కోసం ముందుకొస్తున్నారని చెప్పారు. వారికి ఇదే అవకాశంగా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ఇజ్రాయెల్ యుద్ధం వేళ ఇరాన్‌లో పెద్దెత్తున ప్రజలు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.