హెజ్‌బొల్లాకు మరో బిగ్ షాక్.. మరో కీలక నేత హతం..!

గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీలను లక్ష్యంగా చేసుకున్న ఓ యూనిట్.. మళ్లీ రంగంలోకి దిగొచ్చని చెబుతున్నారు.

హెజ్‌బొల్లాకు మరో బిగ్ షాక్.. మరో కీలక నేత హతం..!

Hezbollah Top Leader Killed (Photo Credit : Google)

Updated On : September 29, 2024 / 6:58 PM IST

Israel Hezbollah War : హెజ్ బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా హెజ్ బొల్లా కమాండర్ నబిల్ క్వాక్ హతమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో క్వాక్ హతమయ్యాడు. హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం చాలా దూకుడుగా ముందుకు పోతోంది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్ బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్ లో విధ్వంసం సృష్టించాయి. నెతన్యాహు సైన్యం దాడుల్లో హెజ్ బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మరోవైపు లక్ష్యం నెరవేరే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు.

హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టడంతో ఇప్పుడా సంస్థ ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీలను లక్ష్యంగా చేసుకున్న ఓ యూనిట్.. మళ్లీ రంగంలోకి దిగొచ్చని చెబుతున్నారు. అదే యూనిట్ 910. దాన్ని బ్లాక్ యూనిట్ లేదా షాడో యూనిట్ అని వ్యవహరిస్తారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందడంతో హెజ్ బొల్లాకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో హెజ్ బొల్లా మరింత తీవ్రంగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో ఇరాన్ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే మిషన్ లో ఇరాన్ మద్దతిస్తుందని ప్రకటించింది. దీనిపై భద్రతా మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ పై యెమన్, లెబనాన్, సిరియా తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉందని, ఈ దాడులకు ఇరాన్ అండగా నిలుస్తుందని సమాచారం.

Also Read : కసితో పోరాడింది, ఒక్కొక్కరిని మడత పెట్టేసింది.. హిజ్బులా టాప్ లీడర్లను ఖతం చేసిన ఇజ్రాయెల్..!

మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో.. హెజ్ బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా మృతి చెందడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు స్పందించారు. నస్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయెల్ లెక్క సరి చేసిందని పేర్కొన్నారు. ఈ చర్య ఇజ్రాయెల్ కు ఓ చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. నస్రల్లా అనేకమంది ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన హంతకుడు అని అన్నారు. తమ శత్రువులపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరైన చర్యగా పేర్కొన్నారు. గత ఏడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ ప్రారంభమైందని బైడెన్ వెల్లడించారు. హెజ్ బొల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఉంటుందని బైడెన్ తేల్చి చెప్పారు.

లెబనాన్ ప్రజలకు, హెజ్ బొల్లాకు అండగా ఉండాలని.. దాడులను ఎదుర్కోవడంలో వారికి సాయం చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. గాజాలో ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకోలేదన్నారు. నస్రల్లా హత్య తర్వాత ఖమేనీని ఇరాన్ లోని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. నస్రల్లా హత్యను ఖండిస్తూ ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతూ టెహ్రాన్ లో వేలాది మంది ఇరానీయన్లను వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.