ఇంకా బుద్ధి రాదా : చైనాలో ముద్దుల పోటీలు

  • Published By: cln raju ,Published On : April 22, 2020 / 08:04 AM IST
ఇంకా బుద్ధి రాదా : చైనాలో ముద్దుల పోటీలు

Updated On : April 22, 2020 / 8:04 AM IST

కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. అక్కడ ఆహారపు అలవాట్లే కరోనాకు కారణమని ప్రపంచ దేశాలు తిట్టుకుంటున్నాయి. నిన్నటి వరకు కరోనాతో సతమతమైన చైనా ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను మొదలుపెట్టింది. అయితే అంతలోనే మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తన కార్యకలాపాలను పునఃప్రారంభించిన ఓ ఫర్నీచర్ కంపెనీ..తొలి రోజునే ముద్దుల పోటీలు నిర్శహించింది. 

సూజూ నగరంలోని యూయా అనే కంపెనీ ఈ పోటి నిర్వహించింది. ఇందుకోసం పది జంటలను ఆహ్వానించింది. వారి మధ్య ఓ పారదర్శకమైన ప్లాస్టిక్ తెరను ఉంచి పోటీల్లో పాల్గొనమని జంటలకు సూచించింది. ఈ పోటీల్లో కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లులు అటు కంపెనీపై ఇటు చైనాపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు కరోనా కారణంగా తమ ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొన్నారని, దాని నుంచి బయటపడి విధుల్లో నిమగ్నం కావడానికి ముద్దుల పోటీ పెట్టామని సదరు ఫర్నిచర్ సంస్థ సమర్థించుకొనే ప్రయత్నం చేస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో తీవ్రంగా విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షా 77 వేల మందికిపైగా బలితీసుకున్న ఈ వైరస్… 210 దేశాలను వణికిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 25 లక్షల 54 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 లక్షల 88వేల మంది కోలుకున్నారు. కరోనా కాటుకు యూరప్‌ వాసులే అధికసంఖ్యలో బలవుతున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల మృతి చెందిన వారిలో అమెరికాకు చెందినవారే అధికంగా ఉన్నారు.

ఫ్రాన్స్‌లో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్కరోజే 531 మంది క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఫ్రాన్స్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల‌ సంఖ్య  20 వేల 796కి చేరింది. క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న మొద‌టి ఐదు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒక‌టిగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఫ్రాన్స్‌లో భారీగానే ఉంది. ఇప్పటికే అక్కడ ల‌క్షా 58 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల్లో 39వేల మంది కోలుకుని డిశ్చార్జవడంతో మ‌రో 98 వేల యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా మహమ్మారి దెబ్బకు రష్యా సైతం అతలాకుతలమవుతోంది.  ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.  ఆ దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటికే 50వేల మార్క్‌ దాటింది. నిన్నటి వరకు అక్కడ 52వేల 763 మందికి వైరస్‌ సోకింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 5వేల 642 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 51మరణించారు. రష్యాలో ఇప్పటివరకు కరోనా బారినపడి మొత్తం 456 మంది చనిపోయారు.

స్పెయిన్‌లో కరోనా మరణాలు 21వేలు దాటాయి. ఒక్కరోజే 430 కరోనా మరణాలు రికార్డవడంతో మొత్తం మరణాల సంఖ్య 21వేల 282కి పెరిగింది. నిన్న కొత్తగా 3వేల 968 కరోనా కేసులు నమోదవడంతో.. స్పెయిన్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2లక్షల 4వేలు దాటింది. ప్రస్తుతం అమెరికా తర్వాత ఎక్కువ కరోనా కేసులు స్పెయిన్‌లోనే ఉండగా…తమ దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న లక్షణాలు కనబడుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను జూన్ ఒకటి వరకు పొడిగించింది సింగపూర్. మే 4నాటికి లాక్‌డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా… మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసి ఉంచాలని ఆదేశించింది. సింగపూర్‌లో ఇప్పటివరకూ 9వేల 125 కరోనా కేసులు నమోదయ్యాయి. వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. సింగపూర్‌లో ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి.