Sudan Landslide : ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 1000 మందికిపైగా దుర్మరణం.. పూర్తిగా కొట్టుకుపోయిన ఓ గ్రామం

Sudan Landslide : అఫ్రికా దేశమైన సూడాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికిపైగా మరణించారు.

Sudan Landslide : ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 1000 మందికిపైగా దుర్మరణం.. పూర్తిగా కొట్టుకుపోయిన ఓ గ్రామం

Sudan Landslide

Updated On : September 2, 2025 / 11:36 AM IST

Sudan Landslide : అఫ్రికా దేశమైన సూడాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మర్రా పర్వతాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. ఆ గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటనలో వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. ఈ విషయాన్ని సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ ధ్రువీకరించింది.

Also Read: Afghanistan : అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. నేలకూలిన భవనాలు.. 500 మంది మృతి.. వేలాది మందికి గాయాలు

సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ (SLM/A) నాయుడు అబ్దుల్‌వాహిద్ మొహమ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 31వ తేదీన కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన జరిగినట్లు, ఓ గ్రామం పూర్తిగా బురదలో మునిగిపోయిందని తెలిపారు.

శిథిలాల కింద కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు, ఇంకా ప్రాణాలతో శిథిలాల కింద ఉన్నవారిని కాపాడేందుకు తక్షణ సహాయం అందించడానికి సహాయంకోసం ఆ బృందం ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. మృతుల్లో పురుషులు, మహిళలతోపాటు చిన్న పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ తెలిపింది.

ఈ ప్రాంతం ఉత్తర డార్ఫర్‌లో ఉంది. ఇక్కడ సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)మధ్య భీకర అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో స్థానిక ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వచ్చారు. ఇప్పటికే ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వీరు.. ఇప్పుడు కొండచరియలు విరిగిపడడంతో మృత్యువాత పడ్డారు.