Donald Trump: వన్ సైడెడ్ డిజాస్టర్.. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది.. భారత్‌పై మరోసారి ట్రంప్ దాడి..!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత దిగుమతులపై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Donald Trump
Donald Trump: చైనా, రష్యా అధ్యక్షులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై దాడికి దిగారు. తీవ్రమైన నిందలు మోపారు. ట్రూత్ సోషల్ లో ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కారు. ఇండియాపై విధించిన టారిఫ్స్ ను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్. ఇందులో భాగంగా భారత్ తో తమ వ్యాపారం పూర్తిగా వన్ సైడెడ్ డిజాస్టర్ గా (ఒక వైపు విపత్తు) ట్రంప్ అభివర్ణించారు.
భారత్ తో అమెరికా వాణిజ్య సంబంధాన్ని పూర్తిగా ఏకపక్ష విపత్తు అని పేర్కొన్న ట్రంప్.. భారత్ అధిక సుంకాలు అమెరికన్ వ్యాపారాలను అడ్డుకున్నాయని నిందించారు. అధిక సుంకాల కారణంగానే భారత్‌కు అమెరికా వస్తువులను విక్రయించలేకపోతోందన్నారు. రష్యా చమురు, రక్షణ దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడిందని.. అమెరికా నుండి మాత్రం పరిమిత కొనుగోళ్లు చేస్తోందని విమర్శించారు ట్రంప్.
”భారత్-అమెరికా వాణిజ్యాన్ని నేను అర్థం చేసుకున్నట్లుగా కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. భారత్ మాతో చాలా ఎక్కువ వ్యాపారం చేస్తుంది. మాకు భారీ మొత్తంలో వస్తువులను అమ్ముతుంది. కానీ మేము ఇండియాతో తక్కువ వ్యాపారం చేస్తాం, వారికి చాలా తక్కువ అమ్ముతాము. ఇప్పటివరకు, ఇది పూర్తిగా ఏకపక్ష సంబంధం. ఇది చాలా దశాబ్దాలుగా ఉంది” అని ట్రంప్ అన్నారు.
భారత్ మాకు ఎక్కువ అమ్ముతుంది, తక్కువ కొంటుంది..
భారత్ తో తక్కువ వ్యాపారం చేయడానికి కారణం.. ఇప్పటివరకు మా వస్తువులపై చాలా ఎక్కువ సుంకాలు విధించడమే అని ట్రంప్ నిందించారు. దీని వల్ల మా వ్యాపారాలు భారత్ లో వస్తువులను అమ్మలేకపోతున్నాయన్నారు. ఇది పూర్తిగా ఒక-వైపు విపత్తు అని చెప్పారు. ఇండియా అమెరికాకు ఎక్కువ వస్తువులు విక్రయించి, తక్కువ కొనుగోలు చేస్తుందని ట్రంప్ అన్నారు. ఏ దేశంపై వేయనంత టారిఫ్స్ ను భారత్ అమెరికాపై వేసిందని ఆరోపించారు. ఇప్పుడేమో సుంకాలు తగ్గిస్తామని భారత్ ప్రతిపాదిస్తోంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
”ఇండియా తన చమురు, మిలిటరీ ఉత్పత్తులను ఎక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది, అమెరికా నుంచి చాలా తక్కువ కొంటుంది. అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించడానికి భారత్ ఇప్పుడు సిద్ధమైంది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. చాలా సంవత్సరాల క్రితమే అలా చేసి ఉండాల్సింది” అని ట్రంప్ అన్నారు. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత దిగుమతులపై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
చైనాలో ఎస్ సీవో సమ్మిట్ లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు సమావేశమైన సంగతి తెలిసిందే. వీరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం సహా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కమ్రంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలను విధించింది. ఇందులో రష్యన్ నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేసినందుకు 25 శాతం ‘జరిమానా’ కూడా ఉంది. ఈ సుంకాన్ని “అన్యాయమైనది, అసమంజసమైనదిగా” ఇండియా పేర్కొంది. పాశ్చాత్య దేశాలు కూడా మాస్కో నుండి కొనుగోలు చేస్తూనే ఉన్నాయని గుర్తు చేసింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని, దేశ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గబోమని భారత్ తేల్చి చెప్పింది. రష్యా నుండి చమురు కొనుగోలు నిర్ణయాన్ని భారత్ సమర్థించుకుంది.
ట్రంప్ విధించిన సుంకాలు గత వారం నుంచి అమల్లోకి వచ్చాయి. విలువైన రత్నాలు, వస్త్రాలు, రొయ్యలు సహా అమెరికాకు రవాణ చేయబడిన దాదాపు 48 బిలియన్ డాలర్ల భారతీయ వస్తువులపై టారిఫ్స్ ప్రభావం చూపాయి.
ట్రంప్ రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించినా.. భారత్ మాత్రం మౌనంగా ఉంది. టారిఫ్స్ తో ప్రభావితమైన కంపెనీలు, రంగాలకు సాయం అందించడంపైన, ఎగుమతి మార్కెట్లను విస్తరించడంపైన దృష్టి సారించింది. టారిఫ్స్ కారణంగా తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు.. 40 దేశాలతో చర్చలు జరుపుతోంది.
Also Read: చైనా గడ్డపై నిలబడి చైనాకే షాక్ ఇచ్చిన మోదీ.. ఒక్క మాటతో…