Cyber Attack On Iran (Photo Credit : Google)
Cyber Attack On Iran : ఇరాన్ లో పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సైబర్ అటాక్స్ తో ప్రభుత్వంలోని న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. కీలకమైన సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్ స్పేస్ విభాగం కూడా ధృవీకరించింది. తమ అణు స్థావరాలతో పాటు ఇంధనం సరఫరా చేసే నెట్ వర్క్ లు, మున్సిపల్, ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్ లు.. ఇలా.. సైబర్ దాడులకు గురైన వాటికి సంబంధించి పెద్ద లిస్టే ఉందని పేర్కొంది.
శనివారం గణనీయమైన సైబర్ దాడులను ఇరాన్ ఎదుర్కొంది. ఈ దాడులతో ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు అన్ని శాఖల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ అణు కేంద్రాలే లక్ష్యంగా సైబర్ దాడులు జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు ప్రతి శాఖ (న్యాయవ్యవస్థ, శాసన, కార్యనిర్వాహక) ఈ సైబర్ అటాక్స్ వల్ల ప్రభావితమైందని, సమాచారం చోరీ జరిగిందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇంధన పంపిణీ, మున్సిపల్ సేవలు, రవాణ, ఓడరేవుల వంటి కీలకమైన నెట్‌వర్క్‌లపైన కూడా సైబర్ దాడులు జరిగినట్లు వివరించారు.
Also Read : అప్పుడు ఇండియా ఔట్ నినాదం, ఇప్పుడు కాళ్ల బేరం..! మాల్దీవులకు భారత్ విలువ తెలిసిందా?
అణుస్థావరాలు, కీలక శాఖలపై భారీ స్థాయిలో జరిగిన సైబర్ దాడులను ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణ చేపట్టింది. ఇది ఎవరి పని? అని తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఈ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. వార్ కి సై అంటే సై అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సైబర్ దాడులు జరగడం ఆ ఉద్రిక్తతలను మరింత పెంచినట్లైంది.
మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా తగ్గేదేలే అంటోంది. అరబ్ దేశాలతో పాటు గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలు సహకరిస్తే ఆ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటాని హెచ్చరించింది ఇరాన్.
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి విపత్తు సమయంలో ఇరాన్ సంచనల విషయం వెల్లడించింది. ఇవాళ భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగాయని తెలిపింది. అణు స్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయని పేర్కొంది.
ఇక, హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా చేసుకుని లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు దిగిన సమయంలో ఇరాన్ సైతం రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడితో ఇరాన్ ప్రత్యక్షంగా పాల్గొంది. అక్టోబర్ 1న జరిగిన ఈ దాడికి నెతన్యాహు ప్రభుత్వం రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్ చమురు, అణు స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందా? అనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, వాటి జోలికి వెళ్లకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నెతన్యాహుకు సూచించారు. ఈ క్రమంలోనే ఇరాన్ పై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరగడం గమనార్హం.
Also Read : మొసాదా, మజాకా..! ఇరాన్ మద్దతుదారులు ఒక్కొక్కరిగా మటాష్..!