Bill Gates: బిల్ గేట్స్ ఆస్తుల్లో తన పిల్లలకు ఇచ్చేది అంతేనా..! గేట్స్ ఎందుకలా నిర్ణయం తీసుకున్నారు.. కారణం ఏమిటంటే?
ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బిల్ గేట్స్ సంపద 155 బిలియన్ డాలర్లు.

Bill Gates
Bill Gates: తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పిల్లలకు చెందడం కామనే. పల్లెటూల్లో రోజువారీ కూలీ నుంచి ప్రపంచ కుబేరుల వరకు తమ ఆస్తులను వారి పిల్లలకు సమాన వాటాలుగా పంచిస్తారు. కానీ, మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రం అందుకు వ్యతిరేకం అంటున్నాడు. ఓ పాడ్ కాస్ట్ లో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. తన ముగ్గురు పిల్లలకు వారసత్వంగా ఎన్ని ఆస్తిపాస్తులు ఇవ్వనున్నారో చెప్పాడు.
ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బిల్ గేట్స్ సంపద 155 బిలియన్ డాలర్లు. ఆయన మాజీ భార్య మెలిందాకు ముగ్గురు సంతానం. వారిపేర్లు జెన్నిఫర్ గేట్స్ నస్సార్, రోరీ గేట్స్, ఫోబ్ గేట్స్. సాధారణంగా బిల్ గేట్స్ ఆస్తులు వారసత్వంగా వారి ముగ్గురికి చెందుతాయి. కానీ, బిల్ గేట్స్ చెప్పినదాని ప్రకారం వారికి వచ్చే ఆస్తులు 1శాతం కంటే తక్కువేనట. అంటే బిల్ గేట్స్ మొత్తం ఆస్తిలో 1.55 బిలియన్ డాలర్లు ఆ ముగ్గురు పిల్లలకు వారసత్వంగా చెందుతాయి. ఈ విషయాన్ని స్వయంగా బిల్ గేట్స్ చెప్పాడు.
పాడ్ కాస్ట్ లో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ‘‘నా పిల్లలకు మంచి విద్యను అందించాను. విలువలతో పెంచా. తండ్రి కూడబెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం నాకు ఉంది. నేను సంపాదించిన మొత్తంలో 1శాతం కంటే తక్కువ పిల్లలకు ఇస్తాను. ఇదేమీ వారసత్వం కాదు. మైక్రోసాప్ట్ లో విధులు నిర్వర్తించమని వారిని అడగటం లేదు. వారు సొంతంగా సంపాదించుకోవడానికి, విజయం సాధించడానికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. అంతేకానీ, మన ప్రేమతో వారిని గందరగోళంలోకి నెట్టేయకూడదని’’ గేట్స్ పేర్కొన్నాడు.
తాను సంపాదించిన ఆస్తులు తన పిల్లల కోసం మాత్రమే కాదని చెప్పిన బిలియనీర్లలో బిల్ గేట్స్ ఒక్కరే కాదు. ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ఉన్నారు. వీరంతా వారసత్వానికి కాకుండా దాతృత్వానికే తమ సంపదలో అధిక భాగాన్ని కేటాయించారు.