Boat Capsized: లిబియాలో పెను విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 42 మంది చనిపోయారు. వారంతా వలసదారులే. యూఎన్ కు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఈ విషయాన్ని తెలిపింది.
లిబియా తీరంలో రబ్బరు పడవ బోల్తా పడింది. ఆ సమయంలో బోటులో 49 మంది ఉన్నారు. అల్ బురీ ఆయిల్ ఫీల్డ్ కు సమీపంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 42 మంది జల సమాధి అయ్యారు. వారంతా వలసదారులే. ఏడుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు” అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది.
అల్ బురి చమురు క్షేత్రం లిబియా తీరానికి వాయువ్యంగా ఉంటుంది. 49 మందితో కూడిన ఓడ మునిగిపోగా.. ఏడుగురిని మాత్రమే లిబియా అధికారులు రక్షించగలిగారు. వలసదారులను సుడాన్, నైజీరియా, కామెరూన్, సోమాలియాకు చెందిన వారిగా గుర్తించారు.
2011లో నాటో మద్దతుతో జరిగిన తిరుగుబాటుతో నియంత ముయమ్మర్ గడాఫీ పతనం అయ్యారు. అప్పటి నుండి లిబియా.. మధ్యధరా సముద్రం మీదుగా యూరప్‌కు వలస వెళ్ళే వలసదారులకు రవాణ మార్గంగా మారింది.
ఈ సంవత్సరం మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన వలసదారుల సంఖ్య ఇప్పటికే 1,000 దాటిందని IOM తెలిపింది. మధ్యధరా ప్రాంతంలో 2024లో మరణాల సంఖ్య 2,452గా ఉంది.
సుర్మాన్, లాంపెడుసా సమీపంలో జరిగిన ఘోరమైన సంఘటన తర్వాత కొన్ని వారాలకే ఈ విషాదం జరిగింది. సెంట్రల్ మెడిటరేనియన్ రూట్ వెంబడి వలసదారులు, శరణార్థులు ఎదుర్కొంటున్న నిరంతర ప్రమాదాలకు ఇది అద్దం పడుతుంది.
అక్టోబర్ మధ్యలో రాజధాని ట్రిపోలికి పశ్చిమాన తీరంలో 61 మంది వలసదారుల మృతదేహాలను గుర్తించారు. సెప్టెంబర్‌లో లిబియా తీరంలో 75 మంది సూడాన్ శరణార్థులతో ప్రయాణిస్తున్న ఓడ మంటల్లో చిక్కుకుని కనీసం 50 మంది మరణించారని IOM తెలిపింది.
Also Read: అలా చేస్తేనే.. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా- షేక్ హసీనా కీలక షరతు..