Sheik Hasina: అలా చేస్తేనే.. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా- షేక్ హసీనా కీలక షరతు..

మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండియాతో బలమైన సంబంధాలు కొనసాగించాము. యూనస్ ప్రభుత్వం వచ్చాక మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు.

Sheik Hasina: అలా చేస్తేనే.. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా- షేక్ హసీనా కీలక షరతు..

Updated On : November 12, 2025 / 8:08 PM IST

Sheik Hasina: గత ఏడాది రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా.. బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లడంపై స్పందించారు. కీలక ప్రకటన చేశారు. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే షరతు విధించారు. అదేమిటంటే.. బంగ్లాదేశ్‌లో అందరి భాగస్వామ్యంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని హసీనా డిమాండ్ చేశారు.

”అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలి. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే నేను తిరిగి బంగ్లాదేశ్ వస్తా” అని షేక్ హసీనా తేల్చి చెప్పారు. అటువంటి పరిస్థితులనే బంగ్లా ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. యూనస్ తాత్కాలిక సర్కార్ పై షేక్ హసీనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్‌తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

”మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇండియాతో బలమైన సంబంధాలు కొనసాగించాము. యూనస్ ప్రభుత్వం వచ్చాక మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు. ఆ సంబంధాలను బలహీనపరుస్తున్నారు. కష్టకాలంలో నాకు ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా” అని షేక్ హసీనా అన్నారు.

“నేను బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి అతి ముఖ్యమైన షరతు బంగ్లాదేశ్ ప్రజలు కోరుకునేదే. భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి తిరిగి రావడం. తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్‌పై నిషేధాన్ని రద్దు చేయాలి. స్వేచ్ఛగా, న్యాయంగా, అందరినీ కలుపుకుని ఎన్నికలు నిర్వహించాలి” అని షేక్ హసీనా చెప్పారు.

”నేను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో విఫలమయ్యాను. దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆ సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు కూడా బాధ్యత తీసుకుని ఉండాల్సింది” అని హసీనా అభిప్రాయపడ్డారు.

తనపై నమోదైన కేసులపైనా ఆమె స్పందించారు. ఈ కేసులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. నిష్పాక్షికమైన ట్రిబ్యునల్ ఐసిసి (ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు) తనను నిర్దోషిగా విడుదల చేస్తుందని యూనస్ కు తెలుసు అని, అందుకే యూనస్ ఈ సవాల్ ను తప్పించుకుంటూనే ఉన్నారని షేక్ హసీనా ధ్వజమెత్తారు.

బంగ్లాదేశ్ లో నిరసనలు హింసకు దారితీశాయి. వారాల తరబడి హింసాత్మక నిరసనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 78 ఏళ్ల హసీనా 2024 ఆగస్టు 5న బంగ్లా నుంచి వచ్చేసి భారత్ లో తలదాచుకున్నారు. ఆమె రాజీనామా చేయడంతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి మార్గం సుగమం అయింది.

Also Read: ట్రంప్ కొత్త రాగం.. హెచ్‌-1బీ వీసాలపై సంచలన ప్రకటన.. వారికి శుభవార్త