Yemen Stampede : యెమన్ లో తీవ్ర విషాదం.. రంజాన్ ఆర్థికసాయం కార్యక్రమంలో తొక్కిసలాట, 80 మందికిపైగా మృతి

సంఘటన జరిగిన సమయంలో వందలాది మంది పేదలు కార్యక్రమంలో గుమిగూడారు. ఆర్థిక సాయం తీసుకోవడానికి భారీగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

Yemen Stampede

Yemen Stampede : యెమన్ లో తీవ్ర విషాదం నెలకొంది. రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 80 మందికిపైగా మృతి చెందారు. వందలమందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి యెమన్ రాజధాని సనాలో రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక సాయం తీసుకోవడానికి భారీగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనపై తిరుగుబాటు సంస్థ హౌతీ అధికారి సమాచారం ఇచ్చారు. హౌతీ ఆధ్వర్యంలో నడిచే అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో వందలాది మంది పేదలు కార్యక్రమంలో గుమిగూడారు. హౌతీ తిరుగుబాటుదారుల అల్-మసీరా శాటిలైట్ టీవీ ఛానెల్ ప్రకారం.. సనాలోని సీనియర్ ఆరోగ్య అధికారి మోతహెర్ అల్-మరౌనీ మరణాల సంఖ్య సమాచారాన్ని అందించారు. కనీసం 13 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

Pakistan : గోధుమ పిండి ట్రక్కుల వద్ద తొక్కిసలాట .. 11 మంది మృతి..

స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా ఆర్థిక సాయాన్ని సరిగ్గా పంపిణీ చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి బ్రిగేడియర్ అబ్దెల్-ఖాలిక్ అల్-అఘరీ పేర్కొన్నారు. ఈద్-ఉల్-ఫితర్ ముందు ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మీడియా నివేదికల ప్రకారం..ఒక పాఠశాలలో ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే సంఘటన తర్వాత తిరుగుబాటుదారులు ఆ పాఠశాలను మూసివేశారు. అలాగే జర్నలిస్టులతో సహా ఎవరినీ అక్కడికి రాకుండా నిషేధం విధించారు.

మరోవైపు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు ప్రజలను నియంత్రించేందుకు గాలిలోకి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. కాగా, ఇద్దరు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నామని, ఘటనపై విచారణ చేపట్టామని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు సనాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.