Iran Fire Incident: ఇరాన్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 32 మంది మృతి

ఇదే ఏడాది ఆగస్ట్‌లో టెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి కానీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

Iran Fire Incident: ఇరాన్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 32 మంది మృతి

Updated On : November 3, 2023 / 5:58 PM IST

Iran Fire Incident: ఉత్తర ఇరాన్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఇప్పటి వరకు సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగ్రూడ్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. స్థానిక మిజాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వైపు పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్థానిక ISNA వార్తా సంస్థ.. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీని షేర్ చేసింది. అందరూ నిద్రపోతున్న వేళ.. చీకటి ఆకాశాన్ని వెలిగించి, గాలిలోకి భారీ పొగలను పంపిందని ISNA పేర్కొంది.

మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న అనంతరం అనేక ఇతర ఫోటోలు బయటికి వచ్చాయి. ఇదే ఏడాది ఆగస్ట్‌లో టెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో అనేక దుకాణాలు దెబ్బతిన్నాయి కానీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. జనవరి 2017లో టెహ్రాన్‌లోని 15 అంతస్తుల ప్లాస్కో షాపింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 16 మంది అగ్నిమాపక సిబ్బందితో సహా 22 మంది మరణించారు.