Australia beach : ఆస్ట్రేలియా బీచ్‌లో వింత వస్తువు చంద్రయాన్-3 శకలమేనా..?
ఆస్ట్రేలియాలోని ఓ సముద్ర తీరంలో కొన్ని వింత వస్తువు కలకలం రేపుతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 శకలం అని భావిస్తున్నారు.

Australian beach Mysterious object Chandrayaan-3
తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (Satish Dhawan Space Centre) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో (Indian Space Research Organisation) ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక ఎల్‌వీఎం3-ఎం4 (LVM3-M4) విజయవంతంగా కక్ష్యవైపు దూసుకెళుతోంది. దీనిపై తాజాగా ఇస్రో ఓ అప్‌డేట్ ఇచ్చింది. తొలిసారి చంద్రయాన్-3 వ్యోమనౌక కక్ష్యను విజయవంతంగా పెంచామని ప్రకటన చేసింది.
ఈక్రమంలో ఆస్ట్రేలియాలోని ఓ సముద్ర తీరంలో వింత వస్తువు కనిపించింది. ఇది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 శకలం అని భావిస్తున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్‌హెడ్ తీరం వద్ద కనిపించిన ఓ వింత వస్తువు ఆకాశం నుంచి పడిందని అది చంద్రయాన్-3ని మోసుకెళ్లిన ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌కు సంబంధించిన భాగమై ఉంటుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
దూసుకెళ్లే సమయంలో ఆ వాహకనౌక ఆస్ట్రేలియా గగనతలం నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. దీంతో దానినుంచి విడిపడిన వస్తువు అక్కడి బీచ్ లో పడి ఉంటుందని అంటున్నారు. బీచ్ లో కనిపించిన ఈ శకలం.. భారత్ గతంలో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ భాగమై ఉంటుందని అంటున్నారు. కానీ అది ఏంటీ అనే విషయాన్ని తెలుసుకోవటానికి పరిశోధకులు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఈ శకలం దేనికి సంబంధించినది అనే విషయాన్ని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ దీని విషయంలో తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. అది విదేశీ అంతరిక్ష సంస్థకు సంబంధించిన భాగమై ఉండొచ్చని భావిస్తున్నామని పరిశోధన తరువాత వివరాలు వెల్లడిస్తామని ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అటువంటి శకలాలు మరి ఎక్కడైనా కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.కాగా ఈ అంశంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పందించలేదు. ఆశకలం ఏమిటో దేనికి సంబంధించినదో తెలియనందున స్థానికులు ఆ శకలం వద్దకు వెళ్లరాదని..దానికి తాకరాదని సూచించింది.