Depression-Overweight : అధిక బరువు ఉంటే కుంగుబాటు ప్రమాదం
అధిక బరువు శరీరక ఆరోగ్యంపైనే కాదు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.అధిక బరువు ఉన్నవారికి కుంగుబాటు ప్రమాదం ఉందని తెలిపారు.

Depression Overweight
Depression with overweight say new study : కుంగుబాటు. దీన్నే డిప్రెషన్ అంటాం. ఇది అవ్వటానికి చిన్నమాటే అయినా..చాలా చాలా ప్రమాదం. యావత్ ప్రపంచాన్నే కలవర పెడుతున్న అతి పెద్ద సమస్య కుంగుబాటు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్య చేసుకోవటానికి కూడా ప్రేరేపించే అతి పెద్ద సమస్య కుంగుబాటు. జీవితంలో పరాజయాలు, ఒంటరితనం, సామాజిక బహిష్కరణ, పేదరికం, ప్రేమలో విఫలం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరుద్యోగం… ఇలా ఎన్నో కారణాలు ‘డిప్రెషన్’లోకి నెట్టి, ప్రాణాలను హరిస్తున్నాయి. కుంగుబాటును అంత తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. ఈక్రమంలో కుంగుబాటుకు గురి కావటానికి అధిక బరువు కూడా ఓ కారణం అంటున్నారు పరిశోధకులు.
అధిక బరువు కుంగుబాటుకు దారితీసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. స్ధూలకాయం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది తెలిసిందే. కానీ తాజాగా అధిక బరువు కేవలం శరీరంపైనే కాదు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని జర్నల్ హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రేట్ బ్రిటన్‌లో ప్రతి నలుగురిలో ఒకరు స్ధూలకాయంతో బాధపడుతుండగా ఈ సమస్య చిన్నారుల్లో కూడా తీవ్రంగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక బీఎంఐ (Body mass index) అంటే వయస్సుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు. ఈ బీఎంఐ కుంగుబాటుకు ఎలా దారితీస్తుందనేది తెలుసుకునేందుకు పరిశోధకులు జన్యు విశ్లేషణ పద్ధతిని అనుసరించారు. యూకే బయోబ్యాంక్ నుంచి 1,45,000 మందికి సంబంధించిన జన్యు డేటాను ఎక్సెటర్ యూనివర్సిటీ పరిశోధకులు విశ్లేషించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధిక బీఎంఐకి సంబంధించిన జన్యు వేరియంట్లను పరిశోధకులు విశ్లేషించి స్ధూలకాయం, కుంగుబాటుకు ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు.
అధిక బీఎంఐ కుంగుబాటుకు దారితీస్తుందని తమ పరిశోధనలో వెల్లడైందని అధ్యయన రచయిత..యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మెడికల్ స్కూల్ జెస్ ఓలాలిన్ తెలిపారు. స్ధూలకాయం జీవక్రియల పనితీరుతో సంబంధం లేకుండా కుంగుబాటు ముప్పునకు దారితీస్తుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. శారీరక ఆరోగ్యం, సామాజిక కారణాలు కూడా స్ధూలకాయం, కుంగుబాటు మధ్య సంబంధంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వెల్లడించారు.
కాగా భారత్ లో కుంగుబాటు బాధితులు దాదాపు 36 శాతం మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. కుంగుబాటును నిర్ధారించటానికి ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు లేవు. మానసిక వైద్యులు ఆయా లక్షణాలను బాధితుల ఉండే తీరును బట్టి ఈ కుంగుబాటుకు గురైనట్లుగా నిర్ధారించి చికిత్స చేస్తారు. కౌన్సిలింగ్ లకు చేస్తారు. దీంట్లో భాగంగా మానసిక వైద్యులు బాధితుల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు. కొన్ని బొమ్మలు చూపిస్తారు. వారు సమాధానం చెప్పే విధానాన్ని..వారి స్పందనను బట్టి అంచనా వేస్తారు. వారి మానసిక స్థితి, భావోద్వేగాలు, పనులు చక్కబెట్టే విధానం వంటివాటిని బట్టి కుంగుబాటు లక్షణాలకు గుర్తిస్తారు. తగిన చికిత్స చేస్తారు.కొన్ని అరుదైన కుంగుబాటు కారణాలను లేదా బిమెన్షియా వంటి మార్పలు ఈఈజీ, ఎంఆర్ఐ వంటి పరీక్షల్లో బయటపడతాయి.