Kim Jong Un
North Korea..Kim Jong Un : ఉత్తర కొరియా(North Korea)లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. గత ఏడాదికంటే 40 శాతం ఎక్కువగా ఆత్మహత్యలు పెరిగాయని దక్షిణ కొరియా గూఢాచార సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఉత్తరకొరియాలో ఏం జరుగుతుంది? అనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అక్కడి ప్రజల జీవితాలు..వారి ఇష్టాలు అయిష్టాలు అన్నీ కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)నియంత పాలన ఆంక్షలను బట్టే ఉంటాయి. అన్ని కిమ్ విధించే ఆదేశాలను బట్టే ఉంటాయి. ఆయన చెప్పిందే చట్టం…చేసేదే న్యాయం అన్నట్లుగా ఉంటుంది.
ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా ఆహార సంక్షోభం కొనసాగుతోంది. దాని తీవ్రతే ఈ ఆత్మహత్యలు అని తెలుస్తోంది. ఆహార కొరత అనేది ఆ దేశానికి కొత్త కాకపోయినా కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు నియంతృత్వ పోకడలు ఈ సంక్షోభానికి మరింత ఆజ్యంపోసినట్లైంది. దీంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ ప్రతినిథి తెలిపారు. ఈ ఆత్మహత్యల విషయంలో దేశాధినేత కిమ్ అధికారులకు ‘రహస్య ఆదేశాలు’జారీ చేసినట్లుగా సదరు సంస్థ వెల్లడించింది.
Donald Trump Under Arrest: రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
ఈ ఆత్మహత్యల విషయంలో కిమ్ అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ ఆత్మహత్యలు ‘సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా’(treason against socialism) అభివర్ణించారు. తమ పరిధిలోని వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకోవాలని అధికారులను ఉత్తర్వులు జారీ చేశారు. కిమ్ ఆదేశాలైతే జారీ చేశారు కానీ..వాటిని అడ్డుకోవాలనే ప్రణాళికలు తమ వద్ద లేవని అధికారులు వాపోతున్నారని రేడియో ఫ్రీ ఆసియా (ఆర్‌ఎఫ్‌ఏ) సంస్థ పేర్కొంది.
ర్యాంగాంగ్ ప్రావిన్సులో ఆకలిచావుల కంటే ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ సంవత్సరం 35 ఆత్మహత్యల కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో దేశంలో ఆకలి మరణాలు గత సంవత్సరం కంటే మూడు రెట్లు పెరిగాయి. ఇవి ఎంత దారుణంగా ఉన్నాయంటే 10 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురించి అధికారి కన్నీటి పర్యంతమవుతు ఇది చాలా బాధాకరమని అన్నారు.