Get Out Pakistan: గెటవుట్ పాకిస్థాన్.. ఇండియా యాక్షన్ షురూ, పాక్‌కు బిగ్ షాక్, భద్రతా సమావేశంలో భారత్ 5 సంచలన నిర్ణయాలు..
పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్నారు. అందుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని వివరించారు.

Get Out Pakistan: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ యాక్షన్ షురూ చేసింది. పాకిస్తాన్ పై ప్రతి చర్యలకు దిగింది. పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్.. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలో 2 గంటల పాటు జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ సబ్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీసీఎస్ తీసుకున్న నిర్ణయాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్నారు. అందుకు సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారిలో 25మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న పాకిస్థాన్ తో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సీసీఎస్ మీటింగ్ లో 5 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అటారీ వాగా బోర్డర్ ను మూసివేస్తున్నట్లు చెప్పింది. పాకిస్తాన్ హై కమిషనర్ వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాకిస్తాన్ సైనిక సలహాదారులు కూడా ఇండియాను విడిచి వెళ్లిపోవాలన్నారు.
ఇక, పాకిస్తాన్ వాసులకు భారత్ లోకి ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ పౌరులు, టూరిస్టులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాక్ కు చెందిన ప్రత్యేక వీసాదారులు 48 గంట్లలో భారత్ ను వీడాలన్నారు. అటు గురువారం అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో పాకిస్తాన్ తో వ్యవహరించబోయే విషయాలను వివరించనుంది.
Also Read: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే జమ్ముకశ్మీర్ లో ముష్కరుల మారణహామానికి కారణమా?
* పాకిస్తాన్ తో సింధూ జలాల ఒప్పందం నిలిపివేత
* భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి
* ప్రత్యేక వీసా ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో భారత్ ను వీడాలి
* పాక్ పౌరులకు భారత్ లోకి నో ఎంట్రీ
* అటారీ-వాఘా బోర్డర్ మూసివేత
* భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునే వరకు ఇది అమల్లో ఉంటుంది.
* పాక్ బోర్డర్ లో ఉన్న అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ తక్షణమే మూసివేత. చెల్లుబాటు అయ్యే పత్రాలతో పాక్ కి వెళ్లిన వారు 2025 మే 1వ తేదీలోపు తిరిగి వచ్చేయాలి.
* పాకిస్తాన్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు జారీ చేసిన ప్రత్యేక వీసాలు వెంటనే రద్దవుతాయి. ప్రత్యేక వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలి. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశానికి ప్రయాణించడానికి అనుమతించబడరు. గతంలో పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన ఏవైనా SPES వీసాలు రద్దు చేయబడినవిగా పరిగణించబడతాయి.
* ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నావిక, వైమానిక సలహాదారులు భారతదేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. వారికి వారం సమయం ఉంది.
* ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను ఉపసంహరణ. వెంటనే వెనక్కి రావాలని పిలుపు. సంబంధిత హైకమిషన్లలోని ఈ పోస్టులు రద్దు.