Pakistan : ఓటింగ్‌కు ముందే రాజీనామా చేస్తారా ? నెక్ట్స్ ప్రధాని ఆయనేనా ?
ఇమ్రాన్ ఆదివారం ఇస్లామాబాద్ ర్యాలీలో చేసిన ఆరోపణలపై మరోసారి మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విదేశీశక్తులు కుట్రపన్నుతున్నాయని ఆరోపించిన ఆయన...

Pak
Pakistan Next Prime Minister : పాకిస్థాన్ రాజకీయాలు మలుపులు మీద మలుపులు తిరుగుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు రాకముందే..ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతోంది. జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ ద్వారా అధికారం కోల్పోవాల్సిన అవసరం లేకుండా..ముందే ఇమ్రాన్ రాజీనామా చేసే పరిస్థితులు తలెత్తాయి. మరి ఇమ్రాన్ తనంత తానుగా రాజీనామా చేసి గౌరవప్రదంగా తప్పుకుంటారా..? లాంఛనప్రాయ ఓటింగ్ కోసం ఆగుతారా అన్నది తేలాల్సి ఉంది. ఏడుగురు సభ్యులున్న ముత్తహిదా క్వామి మూవ్‌మెంట్ -పాకిస్తాన్ MQM-P మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం బలం 164కు పడిపోయింది. ఇమ్రాన్ అవిశ్వాసంలో నెగ్గాలంటే ఇంకా 8మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రతిపక్షాలకు 177 మంది సభ్యుల బలం ఉంది. 25 నుంచి 40 దాకా ఉన్న ఇమ్రాన్ పార్టీ PTI అసమ్మతి ఎంపీల సంఖ్యను కలిపితే..ప్రతిపక్షాల బలం బాగా పెరుగుతుంది. ఓటింగ్‌లో ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఓటేస్తామని ఇప్పటికే అసంతృప్త ఎంపీలు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు గడువు దగ్గర పడుతున్న వేళ ఇమ్రాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలు ఒక్కక్కటిగా బయటకు వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే బలోచిస్థాన్ అవామీ పార్టీ కూటమి నుంచి తప్పుకోగా…MQM-P కూడా అదే బాటలో నడవడంతో…ఇక ఏ క్షణమైనా ఇమ్రాన్ రాజీనామా చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
Read More : Pakistan: కథ కంచికి.. ఇమ్రాన్ ఇంటికి..!
మరోవైపు ఇమ్రాన్ ఆదివారం ఇస్లామాబాద్ ర్యాలీలో చేసిన ఆరోపణలపై మరోసారి మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు విదేశీశక్తులు కుట్రపన్నుతున్నాయని ఆరోపించిన ఆయన అందుకు సంబంధించిన ఆధారాలను తన మంత్రులకు, సీనియర్ జర్నలిస్టులకు చూపించారు. విదేశీ కుట్రకు సంబంధించిన లేఖను ముగ్గురు జర్నలిస్టులకు దూరం నుంచి చూపించారు. ఓ దేశం పాకిస్తాన్ విదేశాంగ విధానంపై అసంతృప్తిగా ఉందని ఆ లేఖను చూసిన జర్నలిస్టులు తెలిపినట్టు ARY న్యూస్ చానల్ వెల్లడించింది. పాకిస్తాన్ అధికారులకు, ఇతర దేశానికి చెందిన అధికారులకు మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఆ లేఖలో ఉన్నాయని తెలిపింది. ఇమ్రాన్ అవిశ్వాసంలో నెగ్గితే అంతా బానే ఉంటుందని, లేదంటే ఆయన అత్యంత కష్టకాలం ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ఆ దేశం అమెరికా అయి ఉంటుందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ వైఖరి…అమెరికా, యూరప్‌కు నచ్చడం లేదని, పాకిస్తాన్ విదేశంగ విధానాలపై అమెరికా అసంతృప్తిగా ఉందని ప్రచారం జరుగుతోంది. యుద్ధం మొదలయిన రోజు ఇమ్రాన్ రష్యాలో పర్యటించడంపైనా అమెరికా ఆగ్రహంతో ఉంది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ నెగ్గితే…తాము అన్నింటినీ క్షమిస్తామని, లేదంటే ఇమ్రాన్‌కు కష్టకాలం తప్పదని అమెరికా అధికారులు హెచ్చరించినట్టు సమాచారం.
Read More : Pakistan: పాక్ లో మళ్లీ రాజకీయ సంక్షోభం..!
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ISI డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ నదీం అంజుమ్‌లతో ఇమ్రాన్ భేటీ కావడంతో….ఆయన రాజీనామాపై తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌కు ఇంకా 17 నెలల పదవీకాలం ఉంది. పాక్ చరిత్రలో ఏ ప్రధానీ పూర్తికాలం అధికారంలో లేరు. పాక్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోవడం కూడా ఇప్పటిదాకా జరగలేదు. ఆర్మీతో విభేదాలు, సొంత పార్టీ తిరుగుబాట్లు, మద్దతు లేక మైనార్టీలో పడిపోవడం, సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడం వంటి కారణాలతో గతంలో ప్రధానులు పదవి కోల్పోయారు. మరి ఇమ్రాన్ కొత్త వ్యూహాలు రచించివ, అన్ని లెక్కలూ సరిచేసి పూర్తికాలం పదవిలో కొనసాగుతారా..లేక అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఓడిపోయి పదవిని కోల్పోతారా..లేక ఓటింగ్‌కు ముందే రాజీనామా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు దేశ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ పేరు వినిపిస్తోంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్. ప్రస్తుతం పాకిస్తాన్ ముస్లిం లీగ్-N అధ్యక్షునిగా ఉన్నారు. పగతంలో మూడుసార్లు ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పంజాబ్‌కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డున షాబాజ్ షరీఫ్ సొంతం. పాక్ రాజకీయాలపై PML-Nకు, షరీఫ్ కుటుంబం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2018లో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్న షాబాజ్ షరీప్‌కు మారిన రాజకీయ సమీకరణాలతో ప్రధాని రేసులోకొచ్చారు. పాక్‌లో మరో కీలక పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ…షాబాజ్‌కు మద్దతిస్తోంది.