Beer In Shoe: పార్లమెంట్‌లో షాకింగ్ ఘటన.. షూలో బీర్ వేసుకుని తాగిన ఎంపీ.. వీడియో వైరల్..

కైల్ మెక్ గిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిండు సభలో ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు.

Beer In Shoe: పార్లమెంట్‌లో షాకింగ్ ఘటన.. షూలో బీర్ వేసుకుని తాగిన ఎంపీ.. వీడియో వైరల్..

Updated On : May 24, 2025 / 10:53 PM IST

Beer In Shoe: ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఎంపీ చేసిన పని నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. ఇంతకీ అతడు ఏం చెశాడో తెలుసా.. నిండు సభలో తన షూలో బీర్ పోసుకుని తాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఎంపీ పేరు కైల్ మెక్ గిన్. టాటూలతో పేరుగాంచాడు. పశ్చిమ ఆస్ట్రేలియా లేబర్ ఎంపీ అతడు. పార్లమెంటులో సరదాగా వీడ్కోలు పలికాడు. తన చివరి ప్రసంగాన్ని “షూయ్” చేస్తూ ముగించాడు. షూయ్.. ఇదొక ప్రసిద్ధ ఆస్ట్రేలియన్ వేడుక. షూ లో బీర్ వేసుకుని తాగుతారు. అదే వేడుకను నిండు సభలో ఆచరించాడు మెక్ గిన్.

మెక్‌గిన్ రెండు సార్లు మైనింగ్, పాస్టోరల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాడు. తనను తాను “ప్రమాదవశాత్తు రాజకీయ నాయకుడి” గా అతడు అభివర్ణించుకున్నాడు. పార్లమెంట్ అందరికీ ఒకటే అని చెబుతాడు. ఫేర్ వెల్ సందర్భంగా తన ప్రసంగం ప్రారంభించడానికి ముందుగా అతడు తన బూట్లలో ఒకదాన్ని తీసి టేబుల్ మీద ఉంచాడు. తన చివరి ప్రసంగంలో.. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు మెక్ గిన్. గోల్డ్‌ఫీల్డ్స్‌లో ఉన్న వారు తన వీడ్కోలును అభినందిస్తారని వ్యాఖ్యానించాడు.

”సభ్యులారా, నన్ను ప్రేమించండి లేదా ద్వేషించండి. నాకు ఏది ముఖ్యం అనేది నా ప్రసంగం సభ్యులకు వివరించిందని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రసంగాన్ని ఎలా ముగించాలో నేను చాలాసేపు ఆలోచించాను. దానిని చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. చీర్స్” అంటూ బీర్ ను తన షూలోకి పోశాడు. ఆ తర్వాత తాగేశాడు. మెక్ గిన్ చర్యతో సభ్యులు ఒకింత అవాక్కయ్యారు. అసలేం జరిగిందో వారికి కాసేపు అర్థం కాలేదు. మెక్ గిన్ చర్యతో వారు విస్తుపోయారు.

Also Read: యాపిల్‌నే కాదు శాంసంగ్‌నూ వదలని ట్రంప్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాడుగా..

అధ్యక్షురాలు అలాన్నా క్లోహేసీ వెంటనే లేచారు. ముందు మీ సీటులో కూర్చోండి అని మెక్ గిన్ తో చెప్పారు. కాగా, కొందరు సభ్యులు నవ్వుతూ చప్పట్లు కొట్టడం విశేషం. “గౌరవనీయ సభ్యుడు కౌన్సిల్ గౌరవాన్ని కించపరచడంలో చాలా సున్నితమైన మార్గాన్ని అనుసరించాడని ఆయనకు బాగా తెలుసు. ఆయన ప్రసంగం ఇప్పుడు ముగిసిందని నేను భావిస్తున్నాను” అని క్లోహేసీ అన్నారు.

కైల్ మెక్ గిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిండు సభలో ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మెక్ గిన్ చేసిన పనిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. “ఈ భూమిపై అమెరికన్లు అత్యంత క్రూరమైన అసభ్యకరమైన వ్యక్తులు అని ప్రజలు అంటుంటారు. అయితే, ఆస్ట్రేలియన్లు వారికన్న ముందున్నారని నేను వారికి గుర్తు చేస్తున్నాను” అని ఒక నెటిజన్ అన్నాడు. చాలామంది నెటిజన్లు మెక్ గిన్ తీరును తప్పుపట్టారు. పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంట్ నిబంధనల ప్రకారం సభలోకి ఆహారం లేదా పానీయాలను కూడా అనుమతించరు. అలాంటి ఏకంగా మద్యం తీసుకురాడం దారుణం అంటున్నారు.

ఒకప్పుడు ఆయిల్ రిగ్‌లో వంటవాడిగా పనిచేసిన కైల్ మెక్‌గిన్, తన ఇద్దరు సహోద్యోగులు ఉద్యోగంలో మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అతను 2017లో పశ్చిమ ఆస్ట్రేలియా శాసన మండలిలోకి ప్రవేశించాడు. 12వ తరగతి ఫెయిల్, టాటూలు వేయించుకున్న తన లాంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ పార్లమెంట్ అందరిదీ అని నమ్మాల్సి వచ్చింది అని మెక్ గిన్ అన్నాడు.