ట్రంప్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన ప్రాసిక్యూటర్స్

Prosecutors serious allegations against Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై సెనెట్‌లో డెమోక్రట్లు అభిశంసన వాదనలను ముగించారు. దాడి జరిగిన సమయంలోని వీడియోలను చూపిస్తూ.. ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించారు. జనవరి 6న ట్రంప్ ప్రసంగం, ఆయన మద్దతుదారుల్లో కొందరు చేసిన దారుణమైన అల్లర్ల వీడియోను చూపిస్తూ డెమోక్రాట్లు వాదించారు.
అమెరికాలోని కేపిటల్ భవనంపై జరిగిన ఘటన ఓ అతిపెద్ద నేరమని అభివర్ణించారు ప్రాసిక్యూటర్లు. ట్రంప్ దుశ్చర్య అభిశంసించలేని నేరం కాదంటే, అంతకంటే దారుణమేది ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెనేట్ సభ్యులకు కేటాయించిన నాలుగు గంటల సమయం ముగిసిన తర్వాత వాదన ముగిసినట్టు తెలిపింది సెనెట్. అమెరికాలో శుక్రవారం రోజు ట్రంప్‌కు తరుపు వాదనలు వినిపించనున్నారు రిపబ్లికన్లు. ఆ తర్వాత సెనెట్‌లో ఓటింగ్ జరగనుంది.
మరోవైపు రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో అభిశంసనకు మద్దతుగా 56 మంది నిలుస్తారు.
ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్ కమలా హ్యారిస్ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు. దీంతో సెనేట్‌లో ట్రంప్ అభిశంసన తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.