పుల్వామా దాడి ఘటనలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు మద్దతు లభిస్తోంది. పుల్వామా ఉగ్రదాడిని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, న్యూజిలాండ్ టెర్రర్ అటాక్ ను ఖండించాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఆ జాబితాలో చేరింది. పుల్వామా దాడి ఘటనను ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు సైనిక పరంగా భారత్ కు సహకారం అందిస్తామని తెలిపింది. మెరుపు దాడులు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.
పుల్వామా దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయానక చర్యగా అభివర్ణించారు. టెర్రర్ అటాక్ కు పాల్పడిన వారిని శిక్షించాలని పాక్ ను ట్రంప్ డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని, పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఉగ్రవాద చర్యలను ప్రేరేపించే దిశగా పాక్ వ్యవహరిచకూడదన్నారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ముందుకెళ్లాలని, ఉగ్రవాదం నిర్మూలన విషయంలో భారత్-పాకిస్తాన్ కలిసి పని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 14వ తేదీన జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దాడి తమపనే అంటూ కాసేపటికే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వీడియోలను విడుదల చేసింది. పుల్వామా దాడి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఆధారాలు ఉన్నా.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం.. తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నారు. ఆధారాలు ఉంటే చూపించండి చర్యలు తీసుకుంటామని కబుర్లు చెబుతున్నారు. అంతేకాదు భారత్ యుద్ధానికి వస్తే ధీటుగా ఎదుర్కొంటామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.