Riyadh Airport Missile Attack : సౌదీ అరేబియాలో భీకర దాడి.. 12 మంది మృతి.. స్పందించిన భారత్.. రంగంలోకి అమెరికా?
Riyadh Airport Missile Attack : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే టెర్మినల్స్ 3, 4 ఉన్న ప్రాంతంలో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో సౌదీ పౌరులతో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీయులు 12మంది ప్రాణాలు కోల్పోయారు.
Riyadh Airport Missile Attack
Riyadh Airport Missile Attack : సౌదీ అరేబియా రాజధాని నగరమైన రియాద్‌ను హౌతీలు లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. శనివారం రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే టెర్మినల్స్ 3, 4 ఉన్న ప్రాంతంలో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో సౌదీ పౌరులతో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీయులు 12మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 300మందికిపైగా గాయాలయ్యాయి. వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. 2015 మే తర్వాత సౌదీలో జరిగిన అత్యంత ప్రాణాంతకమైన దాడి ఇదే కావడం గమనార్హం.
ఈ దాడికి పొరుగున ఉన్న యెమెన్‌లోని ఇరాన్ మద్దతు పొందుతున్న హూతీ తిరుగుబాటుదారులే కారణమని సౌదీ నేతృత్వంలోని కూటమి పేర్కొంది. ధీటుగా బదులిస్తామని హెచ్చరించింది. దాడి నేపథ్యంలో విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
సౌదీపై హౌతీల దాడులను ప్రపంచ దేశాలు ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. సౌదీ అరేబియా నేత, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో మాట్లాడతానని చెప్పారు. హౌతీలకు వ్యతిరేకంగా యుద్ధంలోకి అమెరికా చేరాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయమైన త్వరలోనే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.
సౌదీ అరేబియా ప్రజలు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. విమానాశ్రయంపై జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా రియాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. వీటి కారణంగా ప్రాణనష్టం, గాయాలు, ఆస్తుల నష్టం సంభవించాయని తెలిపింది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కావని, ఇటువంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని భారత్ స్పష్టం చేసింది.
ఈ దాడుల పట్ల సౌదీ అరేబియాలోని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి హన్స్ గ్రుండ్బెర్గ్ స్పందించారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారతాయని.. పదే పదే దాడులు జరగడం వల్ల యెమెన్‌లో శాంతి ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందన్నారు.
