New Coronavirus: చైనాలో కొత్త కరోనా వైరస్.. మానవాళికి మరో భారీ ముప్పు పొంచి ఉందని సైంటిస్టుల హెచ్చరిక..!
ఈ కొత్త కరోనా వైరస్ తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణం కావచ్చన్న సైంటిస్టుల అంచనాలు జనాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.

New Coronavirus: చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏ విధంగా వణికించిందో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మానవాళి మనుగడకే కోవిడ్ వైరస్ సవాల్ విసిరింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ మహమ్మారికి బలయ్యారు. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి చేసిన విలయాన్ని జనాలు మర్చిపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో బాంబు పేల్చారు అమెరికా సైంటిస్టులు. చైనాలో మరో ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అదే HKU5 రకం వైరస్.
ఈ కొత్త కరోనా వైరస్ తదుపరి ప్రాణాంతక మహమ్మారికి కారణం కావచ్చన్న సైంటిస్టుల అంచనాలు జనాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సైంటిస్టులు ఏం చెప్పారంటే.. ఈ కొత్త వైరస్ మానవులను సోకి, వ్యాప్తి చెందే సామర్థ్యానికి దగ్గరలో ఉందట. ఈ వైరస్ లు.. 2012లో ఉద్భవించి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి కారణమయ్యే ప్రమాదకరమైన కరోనావైరస్ MERS-CoV కుటుంబానికి చెందినవి. దాదాపు 34శాతం మరణాల రేటుతో, MERS-CoV వైరస్ ఎంత విధ్వంసం చేయగలదో ఇప్పటికే ప్రపంచానికి చూపించింది.
చైనాలోని ఒక ల్యాబ్ లో HKU5 వైరస్ ను మొదటగా గబ్బిలాలలో గుర్తించారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకుల బృందం ఈ కొత్త వైరస్ మానవ కణాలలో ఎలా వ్యాపిస్తుందో అనే అంశంపై ప్రయోగశాల అధ్యయనం చేసింది. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో చిన్న మార్పు జరిగితే, అది మానవుల గొంతు, నోరు, ముక్కులో ఉండే ACE2 కణాలతో బంధం ఏర్పరచుకుంటుందని కనుగొన్నారు. ఈ మార్పు వైరస్‌ను మానవులకు సోకే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. మానవ కణాలు, వైరస్‌లో నిర్దిష్ట ఉత్పరివర్తనాలు లేకపోతే, తక్కువ ప్రతిస్పందన చూపిస్తాయన్నారు. అయితే ACE2 కణాలతో బంధం ఏర్పరచడానికి అవసరమైన ఉత్పరివర్తనాలు ఉంటే వైరస్ సులభంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
HKU5 వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ MERS తో దగ్గరి సంబంధం కలిగుంది. MERS, COVID-19 లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకమని సైంటిస్టులు చెబుతున్నారు. సోకిన వారిలో మూడవ వంతు మందిని చంపగలదని అంచనా వేశారు. మింక్ లేదా సివెట్ వంటి జంతువులకు HKU5 వ్యాప్తి చెందితే అది మానవులకు సోకే ముందు మరింత బలపడే ప్రమాదం ఉందన్నారు.
పరిశోధనను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లడానికి శాస్త్రవేత్తలు AI ని కూడా ఉపయోగించారు. ప్రత్యేకంగా ఆల్ఫాఫోల్డ్ 3 అనే సాధనం వాడారు. స్పైక్ ప్రోటీన్ ACE2 రిసెప్టార్లతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ నిమిషాల్లో వైరస్ ప్రవర్తనను అంచనా వేసింది. ఈ ప్రక్రియకు సాధారణంగా నెలల సమయం పడుతుంది. AI ఫలితాలు సాంప్రదాయ ప్రయోగశాల ఫలితాలతో దగ్గరగా సరిపోలాయి.